దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనం దిశగా మళ్లుతున్నాయి. తాజా పరిస్థితులను చూస్తూంటే ఈ పతనం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే ఈ పతనం మొత్తానికి మూలకారణం కొవిడ్-19(కరోనా వైరస్). కరోనా విజృంభణ నెమ్మదిస్తేనే మార్కెట్ పుంజుకొనే అవకాశం ఉంటుంది. మరోపక్క అమెరికా మార్కెట్లలోనూ భారీగా కరెక్షన్ జరుగుతోంది. డోజోన్స్ సుమారుగా 12.4 శాతం పతనమైంది. ఇక ఎస్‌అండ్‌పీ-500 సూచీ.. 500 పాయింట్లు పతనమైంది. నాస్‌డాక్ సూచీ 10.5 శాతం కుంగింది. అమెరికా మార్కెట్లలో ఈ స్థాయి విక్రయాల ఒత్తిడి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్యసంస్థ జాప్యం...
అమెరికాలో చాలా కంపెనీల షేర్ల ఇప్పటికే రికార్డు స్థాయి అత్యల్పాలకు చేరుకొన్నాయి. ముఖ్యంగా చైనా, ఇతర కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే సప్లై చైన్ దెబ్బతినడం ఉత్పాదక రంగంపై ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు చాలా దేశాలు ఇతర దేశస్తులపై ఆంక్షలు విధించడం వంటి వాటితో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోంది. ఇప్పటికే కరోనా ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించే స్థాయికి చేరుకొందని చాలా పరిశోధనా సంస్థలు వెల్లడిస్తున్నాయి. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఒక వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన వెలువడితే మార్కెట్ల పరిస్థితి మరికొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది.
కనుచూపు మేరలో కరోనాకు ఉపశమనం లేదు..
మదుపరులు కరోనా విజృంభణపై ఓ కన్నేసి ఉంచాల్సిన సమయం నెలకొంది. మానవ ఆవాసం ఉన్న ఆరు ఖండాల్లో ఈ విజృంభణ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. తాజాగా అమెరికాలో తొలి కరోనా మరణం సంభవించినందున ట్రావెల్ బ్యాన్‌ను అమల్లోకి తీసుకురావడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇది విజృంభించే కొద్దీ వ్యాపారాలు మూతపడతాయి(క్వారంటైన్ కోసం). ఆ ప్రభావం మార్కెట్లపై కూడా ప్రతిఫలిస్తుంది.
ఎస్‌బీఐ కార్డు ఐపీవో..
మార్చి 2 నుంచి ఎస్‌బీఐ కార్డ్ పేమెంట్ సర్వీస్ ఐపీవో ప్రారంభం కానుండటం వల్ల మార్కెట్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో ఇది భాగం కావడం, ఐపీవో విలువ రూ.10 వేల కోట్లకు పైగా ఉన్నందున మదుపరుల్లో ఆసక్తి రేపుతోంది. ఇదే వారంలో ఆంటోనీ వెస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కూడా ఐపీవోకు రానుంది. మార్చి 4 నుంచి దీని ఐపీవో ప్రారంభం కానుంది.
త్రైమాసికంలో 4.7శాతం వృద్ధిపై ఆందోళన..
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వృద్ధిరేటు ఏడేళ్ల కనిష్ఠానికి చేరింది. తయారీ రంగం డీలా పడడం వల్ల 4.7 శాతంగా నమోదైంది. 2012-13 జనవరి-మార్చిలో నమోదైన 4.3 శాతం తర్వాత.. ఆ స్థాయికి వృద్ధి రేటు పరిమితం కావడం ఇదే తొలిసారి. డిసెంబరుతో ముగిసిన 9 నెలల(ఏప్రిల్-డిసెంబరు 2019) కాలంలో వృద్ధి రేటు 5.1 శాతంగానే నమోదైంది. ఈ సారి పరిస్థితి బాగా దిగజారే ప్రమాదముందని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావమే ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడనుంది. దీంతోపాటు మార్చిలో పీఎంఐ సూచీ వృద్ధిరేటు సమాచారం తొలి వారంలో వెలువడనుంది. ఇది కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తుంది.