తెలంగాణ

telangana

ETV Bharat / business

వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 778 పాయింట్లు డౌన్​ - స్టాక్ మార్కెట్లు

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 778 , నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయాయి. చముర ధరల పెరుగుదల మార్కెట్ల పతనానికి కారణమైంది.

STOCK MARKET CLOSE
స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 2, 2022, 3:39 PM IST

Updated : Mar 2, 2022, 4:25 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతుండడం సూచీలను నిరుత్సాహపరిచింది. మరోవైపు అంతకంతకూ ఎగబాకుతున్న చమురు ధరలు మదుపర్లను మరింత కలవరపెట్టాయి.

ఉదయం సెన్సెక్స్‌ 55,629.30 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 55,755.09 - 55,020.10 మధ్య కదలాడింది. చివరకు 778.38 పాయింట్ల నష్టంతో 55,468.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 16,593.10 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజులో 16,678.50 - 16,478.65 మధ్య కదలాడింది. చివరకు 187.95 పాయింట్లు నష్టపోయి 16,605.95 వద్ద స్థిరపడింది. క్యాపిటల్‌ మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.75 వద్ద కొనసాగుతోంది.

నష్టాలకు చమురు ఆజ్యం..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఎలాంటి ఫలితాల్ని ఇవ్వడం లేదు. దీంతో ఈ సైనిక పోరు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేయడం, రష్యా భీకర దాడుల నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం వంటి పరిణామాలు మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని నెలకొల్పాయి.

మరోవైపు చమురు ధర భారీగా పెరిగి బ్యారెల్‌ ధర రూ.110 డాలర్లు దాటింది. ఇది మరింత తీవ్రమైన ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వెలువడుతున్నాయి. ఆసియా పసిఫిక్‌ సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. రష్యన్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ మూతపడడం కూడా సూచీలపై ప్రభావం చూపింది.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

  • సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, రిలయన్స్‌, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్ షేర్లు 6.8 శాతం మేర లాభపడ్డాయి. గత 22 నెలల్లో ఇదే అత్యధిక ఒకరోజు లాభం.
  • చమురు ధరలు భారీగా పెరగగా.. పెయింట్స్‌ స్టాక్స్‌ అన్నీ కుదేలయ్యాయి.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఈరోజు 5 శాతం వరకు నష్టపోయాయి. గతవారం రోజుల్లో 10 శాతానికి పైగా కుంగిన షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరాయి.
  • రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎస్కార్ట్స్‌లో తన వాటాలను పెంచుకున్నారన్న వార్తలతో కంపెనీ షేర్లు 1 శాతానికి పైగా ఎగబాకాయి.
  • ఈ రోజు ట్రేడింగ్‌లో నువోకో విస్టాస్‌ షేర్లు 12 శాతానికి పైగా లాభపడ్డాయి. గత మూడు రోజుల్లో కంపెనీ షేర్లు విలువ 30 శాతానికి పైగా ఎగబాకడం విశేషం.
  • రంగాలవారీగా చూస్తే లోహ, ఇంధన, ఉపకరణాలు, విద్యుత్తు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెలికాం, హెల్త్‌కేర్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.
  • నిఫ్టీ 50 సూచీలో 14 షేర్లు లాభపడగా.. 36 షేర్లు నష్టపోయాయి.

ఇదీ చదవండి:రష్యా స్టాక్‌ మార్కెట్లు బంద్.. భారత్‌కు కలిసొచ్చేనా?

Last Updated : Mar 2, 2022, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details