Stock Market Close: ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగా పడింది. దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాల నడుమ మదుపరులు భారీగా అమ్మకాలు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 2702 పాయింట్లు కోల్పోయి 54 వేల 530 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 815 పాయింట్ల పతనంతో.. 16 వేల 248 వద్ద సెషన్‌ను ముగించింది.
దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి.
బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.
మదుపరుల సంపద 10 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. రష్యా సహా అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి.
లాభనష్టాల్లో..
నిఫ్టీ, సెన్సెక్స్‌లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు.
టాటా మోటార్స్ 10 శాతానికిపైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి.
కారణాలివే..
- ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చన్న ఊహాగానాలను నిజం చేస్తూ రష్యా సేనలు గురువారం ఉదయం తూర్పు ఉక్రెయిన్‌పై దాడికి దిగాయి. అంతర్జాతీయంగా ఆంక్షలు విధిస్తామన్న హెచ్చరికలను లెక్క చేయకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ 'వార్' ప్రకటించడం మదుపరులను కలవరపెట్టింది. దీనిపై నాటో దళాలు ఎలా స్పందిస్తాయోనన్న భయాల నడుమ మదుపరులు అమ్మకాలకు దిగారు.
- అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. రష్యా- ఉక్రెయిన్ పరిణామాల కారణంగా ఏడేళ్ల తర్వాత 100 డాలర్లు దాటడమూ మార్కెట్ల పతనానికి మరో కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ ఎగుమతి దేశాల్లో ఒకటైన రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే ఆయిల్ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడం మదుపరులను కలవరపెట్టింది.
- దీనికి తోడు ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడమూ మార్కెట్ సూచీల పతనానికి మరో కారణమైంది.అంతర్జాతీయంగా ముడిచమురు, బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి.
10 లక్షల కోట్లు ఆవిరి
రష్యా సైనిక చర్య కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవ్వడంతో సుమారు రూ.10 లక్షల కోట్లకు పైగా మదుపరుల సంపద ఆవిరైంది. గత సెషన్‌లో రూ.256 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో రూ.246 లక్షల కోట్లకు చేరింది. ప్రతి 10 షేర్లలో 9 షేర్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ప్రతి 6 స్టాక్స్‌లో ఒకటి లోయర్ సర్క్యూట్‌ను తాకిందంటే స్టాక్ మార్కెట్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రష్యా మార్కెట్లూ మినహాయింపు కాదు..
అంతర్జాతీయ మార్కెట్ల పతనానికి కారణమైన రష్యా సైనిక చర్య ఆ దేశ స్టాక్ మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించగా.. ఆర్‌టీఎస్ సూచీ 49.93 శాతం కుంగింది. మరో సూచీ ఎంఓఈఎక్స్ 45.21 శాతం మేర పతనమైంది. ఆసియా మార్కెట్లు, ఐరోపా మార్కెట్లదీ అదే పరిస్థితి.
ఇవీ చూడండి:ఉక్రెయిన్‌లో బాంబుల మోత.. బెలారస్ నుంచి చొరబడ్డ రష్యా సైన్యం
రిలయన్స్ స్థాయిలో మరో 30 కంపెనీలు: అంబానీ
షేర్లు కొంటే మర్నాడే డీ మ్యాట్ ఖాతాలో జమ