ఒకేసారి పెద్ద మొత్తంలో భారం పడకుండా నెలవారీగా కొంత మొత్తం చెల్లించేందుకు ఉపయోగపడేదే ఈఎమ్ఐ. గృహ రుణం, వ్యక్తిగత రుణం.. ఇలా వివిధ రుణాల విషయంలో ఈఎమ్ఐని ఎంచుకోవచ్చు. నెలవారీగా కాకుండా నిర్ణీత సమయం వాయిదాల రూపంలో చెల్లించేందుకు కూడా బ్యాంకులు అవకాశాన్ని ఇస్తాయి.
ఈఎమ్ఐ లేదా వాయిదాలు సరిగా చెల్లించినట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు కూడా మొగ్గుచూపుతుంటాయి. రుణం తీసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుండి, తర్వాత దెబ్బతిన్నట్లయితే వాయిదాలు చెల్లించటం కష్టం అవుతుంది. వరుసగా మూడు నెలల ఈఎమ్ఐ చెల్లించనట్లయితే బ్యాంకులు ఈ రుణాన్ని ఎగవేతగా భావిస్తాయి. దీనికి సంబంధించి రుణ స్వీకర్తకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు చర్యలు తీసుకుంటాయి.
గృహ రుణం సెక్యూర్డ్ రుణం. అంటే కొనుగోలు చేసిన గృహం తనాఖాలో ఉంటుంది. నోటీసుకు కూడా రుణ స్వీకర్త స్పందించనట్లయితే ఇంటిని విక్రయించే ప్రక్రియను ప్రారంభిస్తుంది సంబంధిత బ్యాంకు. వ్యక్తిగత రుణం, ఇతర రుణాల విషయంలో కూడా నోటీసు అనంతరం స్పందించకపోతే... రుణానికి అనుగుణంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు చర్యలు తీసుకుంటాయి.
బ్యాంకు రుణం తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లయితే కొన్ని చర్యలు తీసుకోవచ్చు. వీటి వల్ల కొంత ఉపశమనం కూడా పొందవచ్చు.
ఈఎమ్ఐ తగ్గించుకోవటం-
బ్యాంకులను ఈఎమ్ఐ తగ్గించమని కోరవచ్చు. బ్యాంకులు రెండు విధాలుగా ఈఎమ్ఐని తగ్గించవచ్చు. నాన్ సెక్యూర్డ్ రుణం(తనాఖా లేని రుణం) అయినట్లయితే సెక్యూర్డ్ రుణంగా మార్చటం ద్వారా ఈఎమ్ఐ తగ్గించుకోవచ్చు. రుణ వ్యవధిని పెంచటం ద్వారా కూడా ఈఎమ్ఐని తగ్గించుకోవచ్చు. దీనినే బ్యాంకు పరిభాషలో రుణ పునర్ వ్యవస్థీకరణ అంటారు.