భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఇరు దేశాల వాణిజ్య వ్యవహారాలపైనా ప్రభావం చూపుతోంది. మూడు చైనా కంపెనీలకు చెందిన రూ.5 వేల కోట్లకుపైగా పెట్టుబడులపై మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్టే విధించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
చైనా సంస్థల పెట్టుబడులపై 'మహా' ప్రభుత్వం స్టే - భారత్ చైనా వివాదం
సరిహద్దులో చైనా ప్రవర్తన, భారత్లో ఆ దేశం పట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మూడు చైనా కంపెనీల పెట్టుబడులపై (రూ.5వేల కోట్లు) స్టే విధిస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గల్వాన్ లోయలో భారత్- చైనా బలగాల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనకు కొద్ది గంటల ముందే.. హెంగ్లి ఇంజినీరింగ్, పీఎమ్ఐ ఎలెక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్, గ్రేట్ వాల్ మోటర్స్ అనే మూడు చైనా సంస్థలతో "మాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0" పేరుతో ఉన్న ఎమ్ఓయూపై సంతకం చేసింది ప్రభుత్వం.
రాష్ట్రంలోని ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఇంజినీరింగ్, ఫోన్ల తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి.. హింగ్లీ ఇంజినీరింగ్ (రూ.250కోట్లు), పీఎమ్ఐ (రూ. 1000కోట్లు), గ్రేట్ వాల్ మోటర్స్ (రూ. 3,770 కోట్లు) అంగీకరించాయి. అయితే సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు, చైనాకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన నిరసనలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను నిలిపివేసింది ప్రభుత్వం.