కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో సాధన ఉద్యోగం పోయింది. అయితే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనేది ఆమె కల. అందుకు ఇదే సరైన సమయమనుకొని ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉందామె.
మేఘన తన వ్యాపార పెట్టుబడి కోసం ఉద్యోగం చేస్తోంది. అయితే కావాల్సిన డబ్బు పోగవడంతో త్వరలోనే రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలో ఉంది.
మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ హవా కొనసాగించే ఇలాంటి కొన్ని ఎవర్‌గ్రీన్ బిజినెస్ వెంచర్స్‌పై దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు.
డెలివరీ చేయగలరా?
ఈ కరోనా కాలంలో సరుకు రవాణా సంస్థలకు గిరాకీ బాగా పెరిగిందని చెప్పచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వడం, తాము కోరుకున్న చోటికి కావాల్సిన వస్తువులు, ఆహార పదార్థాల్ని తెప్పించుకోవడంతో.. నేరుగా షాపుకెళ్లి కొనే వారి కంటే ఇంటి వద్దకే డెలివరీ చేయించుకునే వారే పెరిగిపోయారు. నిజానికి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాట పట్టిన అతి తక్కువ వ్యాపారాల్లో ఈ డెలివరీ సర్వీసెస్ కూడా ఒకటని చెప్పచ్చు. మరి, మీకు వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉంటే ఇదే రంగాన్ని ఎంచుకోవచ్చు.. ఈ క్రమంలో మీరు సొంతంగా ఆయా వస్తువుల్ని రవాణా చేయడంతో పాటు పెద్ద పెద్ద ఈ-కామర్స్ సంస్థలతోనూ అనుసంధానం కావచ్చు. ఇందుకోసం పురుషుల్నే కాకుండా మహిళల్నీ నియమించుకుంటే.. వారికీ ఉపాధి కల్పించిన వారవుతారు. పైగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులొచ్చినా ఈ వ్యాపారం కొనసాగుతూనే ఉంటుందని, తద్వారా బోలెడంత డబ్బూ ఆర్జించవచ్చని ఈ కరోనా కాలంలో నిరూపితమైంది కూడా! మరెందుకాలస్యం.. లెట్స్ ప్రొసీడ్!
నైపుణ్యాలు పంచుకోండి!
మీకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువా? ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తారా? మానసిక సమస్యల్ని పరిష్కరించే నైపుణ్యాలు మీలో ఉన్నాయా? ఇలా సంపూర్ణ ఆరోగ్యం విషయంలో తలెత్తే సందేహాల్ని నివృత్తి చేయగలరా? అయితే అదే మీ బిజినెస్ ఐడియా! ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసిన అనారోగ్యాలపై శ్రద్ధ పెడుతూ వాటి నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మీలో ఉన్న నైపుణ్యాల్ని బట్టి ‘హెల్త్ ఎక్స్‌పర్ట్ అడ్వైజర్’గా మారారంటే ఇక మీకు తిరుగుండదు. ఇందుకోసం మీరు సోషల్ మీడియా పేజీల్ని/సొంతంగా యాప్స్/వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది వరకే ఉన్న నిపుణుల కమ్యూనిటీలో చేరచ్చు. ఒకవేళ మీరే సొంతంగా ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. బ్యూటీ/ఫ్యాషన్.. వంటి విభిన్న రంగాల్లో సలహాలిచ్చే అడ్వైజర్స్‌ని మీ కంపెనీలో చేర్చుకొని మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవచ్చు. ఏదేమైనా.. మీరిచ్చే సలహాలు అవతలి వారి సమస్యల్ని పరిష్కరించేందుకు ఎంత వరకు ఉపయోగపడుతున్నాయన్న దాన్ని బట్టే మీకు ఆదరణ పెరుగుతుంది.