రెండున్నరేళ్ల విరామం తరవాత బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సేవలను అక్టోబరు 5 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. భద్రతా పరమైన ఆందోళనల నడుమ ఈ విమానాల కార్యకలాపాలను నిలిపివేస్తూ 2019 మార్చిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలిచ్చింది. తదుపరి ఆయా విమానాల్లో సాంకేతిక మార్పులను చేసింది బోయింగ్. దీనితో ఈ ఏడాది ఆగస్టు 26న నిషేధాన్ని ఉపసంహరించింది డీజీసీఏ.
నిషేధం ఎందుకు?
2018 అక్టోబరులో లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జావా సముద్రంలో కుప్పకూలి 189 మంది మరణించారు. 2019 మార్చిలోఇథోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇదే మోడల్ విమానం కూలి 157 మంది మృతి చెందారు. ఆ విమానాల ఎంసీఏఎస్ సాఫ్ట్‌వేర్ లోపాల వల్లే ప్రమాదాలు సంభవించాయని తేలింది. దీనితో.. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను పౌరవిమానయాన నియంత్రణ సంస్థలు నిలిపివేశాయి.
దేశీయంగా నిషేధానికి ముందు స్పైస్‌జెట్ ఆధీనంలోని విమానాలు.. 6300 గంటలు ప్రయాణించాయి. సర్వీసులు పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ధ్రువీకరించే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (అమెరికా) పైలట్లకు అదనపు శిక్షణ అవసరమని నిర్దేశించింది. ఈ మేరకు నోయిడాలోని బోయింగ్ సిమ్యులేటర్ కేంద్రంలో 20 మంది పైలట్లు శిక్షణ పొందుతున్నారని స్పైస్‌జెట్ అధికారి ఒకరు చెప్పారు. జెట్ ఇంధనాన్ని (ఏటీఎఫ్) సమర్థంగా వినియోగించుకునే విమానంగా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్‌కు గుర్తింపు ఉంది. స్పైస్‌జెట్ వద్ద ఇలాంటి విమానాలు మొత్తం 13 ఉన్నాయి.
ఇదీ చదవండి:Fuel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు