దసరా, దీపావళి... ఈ రెండు పండుగలు చాలా ముఖ్యమైనవి. ఈ సీజన్లో చాలా మంది బట్టలు, నగలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వివిధ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే ఆఫర్లు వినియోగదారులను ప్రేరేపించేలా ఉంటాయి. దీంతో తెలియకుండానే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అనంతరం ఇది కొనుగోలు చేయాల్సింది కాదు అనే భావనలోకి వస్తారు.
పండుగ వేళ ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడటం, కొనుగోళ్లు చేసి తర్వాత చెల్లించే సదుపాయాలను ఉపయోగించుకోవటం వల్ల భారం పెరుగుతుంది. దీంతో ఆర్థికంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎక్కువగా ఖర్చు పెట్టి తర్వాత పరిస్థితిని సమీక్షించుకోవటం కంటే ముందే జాగ్రత్త పడటం మేలు. పండుగ సీజన్ సాధారణంగా చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రణాళిక ప్రకారం వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువ ఖర్చు పెట్టడం
పండుగకు నిర్ణయించుకున్న ఖర్చుకు సంబంధించిన పరిమితిని దాటి చాలా మంది ఖర్చు చేస్తుంటారు. షాపింగ్ మాల్ లేదా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి వెళ్లగానే ఆఫర్లు ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న ఆఫర్ మళ్లీ భవిష్యత్తులో ఉండవనే భావనతో అవసరం ఉన్న వాటితో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని వల్ల బడ్జెట్‌ను దాటి ఖర్చు చేస్తారు.
పండుగ తర్వాత.. చేసిన తప్పిదాన్ని తెలుసుకుంటారు. క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లైతే డ్యూ ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆర్థికంగా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లయితే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బడ్జెట్‌కు కట్టుబడి ఉండి, ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేయకూడదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఖర్చు చేయటం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి వస్తువుల కొనుగోలులో నియంత్రణ వహించాలి.
ఫెస్టివల్ బోనస్‌ను పూర్తిగా ఖర్చు చేసుకోవటం
దసరా, దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తాయి. అయితే దీనిని తెలివిగా ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది దీనిని ప్రణాళిక లేకుండా ఇష్టం ఉన్నట్లు ఖర్చు చేస్తారు. వాస్తవానికి బోనస్ అనేది వాళ్లు కష్టపడి సంపాదించుకున్న మొత్తమే.
బోనస్ మొత్తాన్ని ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణాన్ని ముందే చెల్లించటం, వ్యక్తిగత రుణం చెల్లించుకోవటం, నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగించుకోవటం తదితరాల కోసం ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. ఆర్థికంగా అవసరం లేనట్లయితే సంపద సృష్టించుకునేందుకు ఈ మొత్తంలో ప్రధాన భాగం ఉపయోగించుకోవచ్చని వారు అంటున్నారు.