జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ దేశీయ మార్కెట్లో తన వాటాను రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది. తద్వారా దేశీయ కార్ల మార్కెట్లో క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం వస్తుందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ స్టెఫెన్ నాప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో ఇతర వ్యాపారాల మాదిరిగా ఆటోమొబైల్ మార్కెట్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చిందని వివరించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్ స్థితిగతులు, అంచనాలు, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా లక్ష్యాలు, సంబంధిత ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా,ముఖ్యంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ మీద కొవిడ్-19 ప్రభావం ఎలా ఉంది?
ప్రతి పెద్ద పరిణామం అనూహ్యమైన మార్పులు తీసుకువస్తుంది. కొవిడ్-19 కూడా అటువంటిదే. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, ఉపాధి అవకాశాల మీద ఈ మహమ్మారి ఎంతగానో ప్రభావం చూపింది. కానీ నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కార్ల కొనుగోలుకు ‘ఎంక్వైరీ’లు, బుకింగ్‌లు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ప్రయాణాలకు వీలు కల్పించే సొంత కారు కొనుగోలుకు ముందుకు వచ్చే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. మరోపక్క డిజిటల్ మార్కెటింగ్- విక్రయ పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరమూ ఏర్పడింది. రిటైల్ అమ్మకాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై నిర్వహించాల్సి వస్తోంది. కార్ల డెలివరీ ప్రక్రియను భద్రమైన పద్ధతుల్లో ‘కాంటాక్ట్‌లెస్ మోడల్’ లో నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వినియోగదార్లలో ఉన్న భయాలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాల నిర్వహణ తీరుతెన్నులు మారాల్సిందే. అందువల్లే ఇష్టం ఉన్నా లేకున్నా... ‘డిజిటల్ పద్ధతులను’ అందిపుచ్చుకోవలసి వస్తోంది. ఇవన్నీ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కొవిడ్-19 తెచ్చిన మార్పులుగా భావించవచ్ఛు
ప్రశ్న: మలిదశలో తీసుకున్న రానున్న ‘ఫోక్స్‌వ్యాగన్ టైగన్’ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
‘ఎస్‌యూవీడబ్లూ’ వ్యూహంలో భాగంగా ఈ మోడల్‌ను ఆవిష్కరించబోతున్నాం. వచ్చే ఏడాదిలో ఈ సరికొత్త వాహనం మార్కెట్లో విడుదల చేస్తాం. రూపం, సాంకేతిక నైపుణ్యం, భద్రత పరంగా ఈ విభాగంలోని అత్యుత్తమమైన వాహనం ఇదేనని చెప్పగలను. ఇందులో 93 శాతం విడిభాగాలను భారత్ నుంచే సేకరించాం. అందువల్ల దీని ధర కూడా ఎక్కువగా ఉండదు.
ప్రశ్న: కొత్త మోడళ్ల ఆవిష్కరణ ప్రణాళికలేమైనా మారాయా?
మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. భారత మార్కెట్లో వచ్చే రెండేళ్లలో ఎస్‌యూవీ, ఎస్‌యూవీవీ విభాగాల్లో... కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు గత ఏడాదిలో ప్రకటించాం. దీనికి అనుగుణంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టీ-రాక్, టిగువాన్ ఆల్‌స్పేస్ మోడళ్లు విడుదల చేశాం. వీటికి మార్కెట్లో ఎంతో ఆదరణ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం సాధించిన టీఎస్‌ఐ టెక్నాలజీ ఇంజన్లతో ఈ ఎస్‌యూవీలను ఆవిష్కరించాం. మలిదశలో మరికొన్ని కొత్త మోడళ్లు తీసుకురాబోతున్నాం.
ప్రశ్న: కియా, ఎంజీ మోటార్స్ తమ ప్రారంభ మోడళ్లతోనే సమున్నతమైన విజయాలు సాధించాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?