తెలంగాణ

telangana

ETV Bharat / business

'వైరస్‌లను నిరోధించే రంగులకు గిరాకీ' - అనూజ్​ జైన్​ వార్తలు

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్​లను నిరోధించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రంగులపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నరాన్నారు కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ జైన్. అందుకు తగినట్టుగానే నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు 'ఈనాడు'​ ముఖాముఖిలో చెప్పారు.

NEROLAC PAINTS EXECUTIVE DIRECTOR ANUZ JAIN
వైరస్‌లను నిరోధించే రంగులకు గిరాకీ

By

Published : Nov 27, 2020, 11:31 AM IST

Updated : Nov 27, 2020, 5:51 PM IST

ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. వైరస్‌లను నిరోధించడం లాంటి ఆధునిక సాంకేతికత కలిగిన రంగులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుజ్‌ జైన్‌ చెప్పారు. కొవిడ్‌-19 పరిణామాల్లో రంగుల పరిశ్రమ ఊహించిన దానికన్నా ముందే కోలుకుందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో అత్యాధునిక ప్లాంటు నిర్మించబోతున్నామని 'ఈనాడు​' ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ...

* కొవిడ్‌-19 ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు పూర్తిగా కోలుకోలేదు. రంగుల పరిశ్రమపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. చిన్న పట్టణాల నుంచి ప్రస్తుతం రంగులకు గిరాకీ బాగానే ఉంది. మెట్రో, పెద్ద నగరాల్లో రంగుల పనివారిని ఇంకా ఇళ్లలోకి అనుమతించేందుకు ఇష్టపడటం లేదు. ఆర్థికాభివృద్ధిని బట్టి, గిరాకీ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నాం.

* రంగుల పరిశ్రమ కొవిడ్‌-19కి ముందున్న వ్యాపార స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందని మీ అంచనా?

ఇతర రంగాలతో పోలిస్తే రంగుల పరిశ్రమ వేగంగా కోలుకుందనే చెప్పాలి. మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా ఊహించిన దానికంటే ముందుగానే పూర్వ స్థితికి వస్తోంది. మహమ్మారి ఇప్పుడిప్పుడే మన నుంచి దూరంకాదనే విషయాన్ని ప్రజలు గుర్తించి, రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. రిటైల్‌ విభాగంలో విక్రయాలు అధికంగా ఉన్నాయి. కొవిడ్‌ తర్వాత చాలా మంది సొంత వాహనాలపై మొగ్గు చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు, కార్లకు గిరాకీ పెరగడంతో అక్కడా అమ్మకాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగాయి. దీంతో ఆ విభాగంలోనూ గిరాకీ కనిపిస్తోంది.

* రంగుల వినియోగంలో వస్తున్న కొత్త పోకడలు ఏమిటి?

సాధారణంగా రంగులు వేయించడం అంటేనే ఇల్లును పూర్తిగా శుద్ధి చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత ఒక మంత్రంగా మారాయి. ఇప్పుడు ప్రజలు వీటిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రభావం రంగులు వేయించడంపైనా కనిపిస్తోంది. ప్రజలు గతంలో కంటే ఎక్కవ సమయం ఇంటిలోనే గడుపుతున్నారు. అందువల్ల వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌లు, తేమను నిరోధించే రంగులపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

* కొత్తగా ఎలాంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నారు?

కొన్ని నెలల క్రితం అందుబాటు ధరలో ఉండే ఎమల్షన్‌ పెయింట్లు తీసుకొచ్చాం. ఇటీవలే వైరస్‌లను అడ్డుకునే రంగులనూ అందుబాటులోకి తెచ్చాం. ఇది దేశంలోనే మొదటి యాంటీ వైరల్‌ పెయింట్‌. ఇంటిలోపల కొవిడ్‌-19 వైరస్‌ను ఇది అడ్డుకుంటుంది. 99.9శాతం సూక్ష్మక్రిములను తగ్గించేందుకు, తేమను నిరోధించేందుకు ఇది తోడ్పడుతుంది. గోడలతో పాటు, ఎలాంటి దుస్తులపైనైనా క్రిములను నిర్మూలించే ప్రత్యేక ఉత్పత్తినీ మేము మార్కెట్లోకి విడుదల చేశాం. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువే. నెరోలాక్‌ డిసిన్‌ఫెక్ట్‌ హెచ్‌డబ్ల్యూఎస్‌ 256 లాంటివి అందుబాటులో ధరలోనే తీసుకొచ్చాం. మా ప్లాంట్లతోపాటు, మొత్తం సరఫరా వ్యవస్థలోనూ కొత్త సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నాం. యంత్ర అభ్యాసం (మెషిన్‌ లెర్నింగ్‌), వర్చువల్‌ వేదికల ద్వారా విక్రయాలు నిర్వహించేందుకు వీలుగా పరికరాలను అందించాం. వినియోగదారుల కోసం 9 ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చాం. వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించడంపైనా దృష్టి సారించాం.

* తెలుగు రాష్ట్రాల్లో మీ మార్కెట్‌ ఎలా ఉంది? మీ లక్ష్యాలు ఏమిటి?

రంగుల పరిశ్రమ మొత్తానికీ దక్షిణ భారత దేశం అతి ముఖ్యమైన మార్కెట్‌. ఇక్కడ ప్రీమియం కొనుగోలుదారులు ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వాటా కూడా ఎక్కువే. విశాఖపట్నంలో అత్యాధునిక ఉత్పత్తి ప్లాంటు నిర్మించబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మాకు 5 సేల్స్‌ ఆఫీసులున్నాయి. మా మార్కెట్‌ శాతాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం.

ఇదీ చదవండి:ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

Last Updated : Nov 27, 2020, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details