కేంద్ర బడ్జెట్ 2020-21లో అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతి జిల్లాను ఒక ఎక్స్పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పద్దు 2020: 'ఇకపై ప్రతి జిల్లా ఒక ఎక్స్పోర్ట్ హబ్' "ప్రతి జిల్లా ఒక ఎక్స్పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చెందాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. ప్రతి జిల్లా ఎగుమతుల హబ్‌గా మారేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంస్థాగత చర్యలు చేపట్టాలి. వస్తువుల కొనుగోలు, వివిధ రకాల సేవలకు దేశంలో ఒక ఏకీకృత కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా.. ప్రభుత్వ ఈ-మార్కెట్, జెమ్లలో మార్పులు చేయనున్నాం."
- నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి.
రాష్ట్రాల స్థాయిలో విద్యుత్ బిల్లులు, రవాణా వ్యయాలు, వ్యాట్, ఇతర పన్నులకు సంబంధించి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు నిర్మలా. దేశీయ మొబైల్ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రూ. 1.3 లక్షల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జౌళి రంగానికి రూ. 1480 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం రూపొందించనున్నట్లు ప్రకటించారు నిర్మలా. 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు, ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ. 27,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.