తెలంగాణ

telangana

ETV Bharat / business

2020లో భారీగా తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య

విమాన ప్రయాణికుల సంఖ్య 2019తో పోలిస్తే 2020లో 56.29శాతం తగ్గినట్లు డీజీసీఏ వెల్లడించింది. గతేడాది దేశీయ విమానాల్లో 6.3కోట్ల మంది ప్రయాణించినట్లు తెలిపింది. అత్యధికంగా ఇండిగో సంస్థ విమానాల్లో 3.25 కోట్ల మంది ప్రయాణించారని పేర్కొంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన ఆంక్షలే విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం.

six-crore-domestic-passengers-travelled-in-air-last-year
2020లో భారీగా తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య

By

Published : Jan 17, 2021, 5:26 AM IST

గతేడాది దేశీయ విమానాల్లో 6.3కోట్ల మంది ప్రయాణించారని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) వెల్లడించింది. విమాన ప్రయాణికుల సంఖ్య 2019తో పోలిస్తే 56.29శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 2020లో కరోనా, లాక్‌డౌన్‌ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపాయన్నది విధితమే. కరోనా వ్యాప్తి దృష్ట్యా మొదట దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసింది. ఆ తర్వాత అన్‌లాక్‌లో భాగంగా నిర్దేశించిన అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించింది. అయినా, ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు డీజీసీఏ లెక్కలు చెబుతున్నాయి.

2020లో దేశీయ విమానయానంలో ఇండిగో సింహాభాగం సేవలందించింది. ఈ సంస్థ విమానాల్లో 3.25 కోట్ల మంది ప్రయాణించారు. అంటే మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 51.7శాతం. స్పైస్‌జెట్‌ విమానాల్లో 93.9లక్షల మంది ప్రయాణించారు. ఇది మొత్తం ప్రయాణికుల్లో 14.9శాతంగా ఉంది. ఇక ఎయిర్‌ ఇండియాలో 69.32లక్షలు, గోఎయిర్‌లో 54.38లక్షలు, ఎయిర్‌ ఏషియా ఇండియాలో 43.87లక్షలు, విస్తారాలో 39.39లక్షల మంది విమానయానం చేశారు. గత డిసెంబర్‌లో మొత్తం 73.27లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఇది 2019తో పోలిస్తే 43.72శాతం తక్కువ. అయితే, పర్యటక సీజన్‌ ముగియడంతోనే డిసెంబర్‌లో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు డీజీసీఏ చెబుతోంది.

తొలిస్థానంలో ఇండిగో

గత డిసెంబర్‌లో అన్ని విమానాల్లో ఆక్యుపెన్సీ రేట్‌ 65.1 శాతం నుంచి 78 శాతం ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది. అత్యధికంగా స్పైస్‌జెట్‌లో 78శాతం ఆక్యూపెన్సీ ఉందని పేర్కొంది. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లో ఇండిగో సంస్థ ఉత్తమ సేవలు అందించి తొలిస్థానంలో నిలిచినట్లు డీజీసీఏ వెల్లడించింది. తర్వాతి రెండు స్థానాల్లో ఎయిర్‌ ఏషియా ఇండియా, విస్తారా నిలిచాయి.

ఇదీ చూడండి: భారత్​లో టీకా పంపిణీ- తొలిరోజు విజయవంతం

ABOUT THE AUTHOR

...view details