కొవిడ్-19 వ్యాధి నిరోధం కోసం ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకా త్వరలో భారత్ బయోటెక్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో వెల్లడవుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వివరించారు.
"ఇప్పటికే భారత్ బయోటెక్ విడుదల చేసిన కొవాగ్జిన్ టీకా ఇంజక్షన్‌తో ఇచ్చేది. ముక్కు ద్వారా, చుక్కల మందు రూపంలో టీకా ఇవ్వడం ఎంతో సౌకర్యంగా ఉండటం సహా పంపిణీ ఎంతో సులువు అవుతుంది. దీన్ని ఆవిష్కరించడానికి భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని భారత్ బయోటెక్ కుదుర్చుంది. అధిక జనాభా గల మనదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ తరహా టీకా మేలైనది"
-డాక్టర్ కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ