ఫిబ్రవరి 1... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. అందుకే ఈసారి బడ్జెట్ కసరత్తులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా భాగస్వామి అవుతున్నారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భారత్ తీవ్రమైన ఆర్థిక మందగమనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రభుత్వానికి కీలకంగా మారింది. 2019 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ నామమాత్రపు జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ సిరీస్ ప్రవేశపెట్టిన తర్వాత వృద్ధి రేటు అతి తక్కువ నమోదవడం ఇదే ప్రథమం. ఈ నెల ప్రారంభంలో నామమాత్రపు జీడీపీ వృద్ధి గణాంకాలు వెలువరించింది కేంద్రం. ఈ గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. గత కొన్ని దశాబ్దాలలో ఇదే అత్యల్పం.
ఆ ఆలోచన మారాల్సిందే
వృద్ధి మందగమనం విరుగుడు కోసం భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాలు సహా బడ్జెట్లో ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మందగమనం నుంచి బయటపడేందుకు వ్యయం పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వాలు వీడాలి. వ్యయాలు పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చన్న భ్రమ నుంచి బయటకు రావాలి. దీన్ని నిరూపించడానికి చాలా మార్గాలు,కారణాలు ఉన్నాయి.
నిధులే లేవు
వ్యయాలను ఒక్కసారిగా పెంచడానికి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద అధిక నిధులు లేవు. జీడీపీ వృద్ధి మందగిస్తే పన్నుల రాబడి కూడా తగ్గుతుంది.
ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రూ.2 లక్షల కోట్ల పన్ను రాబడికి కొద్ది దూరంలో ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) గణాంకాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో స్థూల పన్నుల రాబడి వృద్ధి రేటు పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 2009-10 తర్వాత ఇదే అత్యల్పం. కార్పొరేట్ పన్ను సంస్కరణల కోసం సంస్థల లాభాలపై పన్ను తగ్గించి ఇప్పటికే కేంద్రం తన ఆదాయాన్ని గణనీయంగా త్యాగం చేసింది.
పన్నేతర ఆదాయ పరిస్థితీ అంతే
ప్రభుత్వానికున్న మరో ఆదాయ వనరు... పన్నేతర ఆదాయం. రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం తీసుకునే నిధులు ఇదివరకే లెక్కించారు. ఎయిర్ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) వాటాల అమ్మకం ఈ ఏడాది పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో పన్ను ఆదాయాల్లో కొరత ఉన్న ఈ సందర్భంలో పన్నేతర ఆదాయాలు సర్దుబాటు చేసే అవకాశాలు లేనట్లే. 2019-20 సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో 2019 సెప్టెంబర్ నాటికి కేవలం 16.53 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
'మౌలికం'తో సమస్యలు ఇవే
ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టడం ఓ ప్రధాన అవకాశం. అయితే... ఈ ప్రాజెక్టులలో పెట్టుబడుల శాతాన్ని పెంచడం ఇప్పుటికిప్పుడే ఫలితాన్నివ్వదు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు దీర్ఘ కాలానికి సంబంధించిన విషయం. కానీ వృద్ధిని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉంది.