కరోనా వైరస్ రాక ముందు వీకెండ్ షాపింగ్‌లు, ఆన్‌లైన్ కొనుగోళ్లు జోరుగా కొనసాగేవి. అవసరం ఉన్నా.. లేకున్నా పడి ఉంటాయిలే అని తెగ కొనేసేవారు. అవసరమున్న వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉంటే ఓఎల్‌ఎక్స్, క్వికర్ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్.. కొన్ని దుకాణాల్లో సెకండ్ హ్యాండ్‌లో కొనేవారు. అయితే కరోనా విసిరిన పంజాకి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్లa అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులో పడ్డారు. ఇప్పుడిప్పుడే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బు సరిపోక సెకండ్ హ్యాండ్‌లో కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. తాము కొనుగోలు చేసిన వస్తువు యజమానులకు కరోనా ఉంటే.. తమకు సోకుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు చేసుకుంటే ఏ సమస్య ఉండదని పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
దుకాణాలకు వెళ్లకుంటేనే మంచిది..
ఏదైనా వస్తువును అమ్మాలన్నా.. కొనాలన్నా దుకాణాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అక్కడికి కరోనా సోకిన వ్యక్తి వచ్చినట్లయితే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్ పోర్టళ్ల పిక్‌అప్, డెలివరీకి ప్రాధాన్యమివ్వండి. దీని ద్వారా ఒక్క మనిషితో మాత్రమే కాంటాక్ట్ ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుంది. వస్తువుల మార్పిడి జరిగిన వెంటనే చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రంగా కడగండి. కరెన్సీ నోట్ల బదులు ఆన్‌లైన్ పేమెంట్ చేయడం ఉత్తమం. అవసరమైతేనే వస్తువులను కొనండి లేదా అమ్మండి.