ఫోర్బ్స్ అమెరికా శ్రీమంతుల జాబితాలో భారత సంతతికి చెందిన ఏడుగురికి చోటు దక్కింది. 2020కి గాను అమెరికాలోని అత్యంత ధనవంతులైన 400 మందితో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తుల పేర్లు ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్ సీఈఓ జై చౌదరీ, సింపనీ టెక్నాలజీ గ్రూపు ఛైర్మన్ రమేశ్ వాద్వాని, వేఫెయిర్ సహవ్యవస్థాఫకుడు, సీఈఓ నీరజ్ శా, కోశ్లా వెంచర్స్ వ్యవస్థాపకుడు వినోద్ కోశ్లా, షేర్‌పాలో వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ కవిటర్క్ రామ్ శ్రీరామ్, రాకేశ్ గాంగ్వాల్, వర్క్‌డే సీఈఓ అనిల్ భూశ్రీ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
వరుసగా మూడోసారి బెజోస్ అగ్రస్థానం..
అమెరికాలో అత్యంత శ్రీమంతుడిగా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానాన్ని సాధించారు. ఈయన నికర సంపద 179 బిలియన్ డాలర్లు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 111 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (85 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలోను, బెర్క్‌షైర్ హాథ్‌వే సీఈఓ వారెన్ బఫెట్ (73.5 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానంలో నిలిచారు.