కార్పొరేట్ బకాయిదార్లకు వ్యక్తిగత హామీదార్లుగా ఉన్న వారిపై దివాలా చర్యల విషయంలో అనుమానాలను పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దివాలా స్మృతి(ఐబీసీ) కింద రుణాల రికవరీ విషయంలో అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోడానికి బ్యాంకులను అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్(2019)ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఐబీసీ కింద ఖాయిలా పడ్డ కంపెనీల పునరుజ్జీవానికి పరిష్కార ప్రణాళికకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, వ్యక్తిగత హామీదార్లు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రద్దు కావని, అవి విడిగా కాంట్రాక్టులకు లోబడి ఉండడమే అందుకు కారణమని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒక స్వతంత్ర కాంట్రాక్టు ఆధారంగా ఏర్పడ్డ ఆ హామీ లిక్విడేషన్ లేదా దివాలా ప్రక్రియ లేదా ఆపరేషన్ ఆఫ్ లా లేదా ఇన్‌వాలంటరీ ప్రక్రియ కారణంగా విమోచనం చెందజాలదని 82 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 'చట్టబద్ధం, చెల్లుబాటు అయ్యేది' అని ధర్మాసనం తెలిపింది. రుణాలు పొందడం కోసం బ్యాంకులు, ఆర్థిక కంపెనీలకు వ్యక్తిగత హామీలు ఇచ్చిన వివిధ కంపెనీలు, వ్యక్తులు దాఖలు చేసిన 75కు పైగా పిటిషన్ల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.