కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. పలు సంస్థలు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో 2021నాటికి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్ సహా పేద, మధ్య ఆదాయ దేశాల కోసం సిద్ధం చేస్తామని చెప్పారు పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. గావి, బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ సహకారంతో వ్యాక్సిన్ ప్రాజెక్టు పనులకు వేగవంతం చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వ్యాక్సిన్ ధర రూ.225(3 డాలర్లు)కు మించదని స్పష్టం చేశారు పూనావాలా. మొత్తం 92 దేశాలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్లను గావికి సమకూర్చుతుంది. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఈ నిధులను సీరం సంస్థకు ఇవ్వనుంది గావి.