ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయాణికుల వాహన విక్రయాలు దేశీయంగా 2019-20 ఇదే సమయంతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. పండుగ సీజన్, వినియోగదారుల్లో కొనుగోలు సెంటిమెంట్ మెరుగవ్వడం వంటివి ఇందుకు కారణంగా తెలిపింది వాహన తయారీదారుల సంఘం (సియామ్).
క్యూ2 వాహన విక్రయాలు ఇలా..
- 2020-21 రెండో త్రైమాసికంలో 7,26,232 ప్రయాణికుల వాహనాలు విక్రయమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 6,20,620 యూనిట్లుగా ఉంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 46,90,565 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 46,82,571 యూనిట్లే విక్రయమయ్యాయి.
- వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 20.13 శాతం క్షీణించి.. 1,33,524 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019-20 క్యూ2లో 1,67,173 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం.
- త్రిచక్ర వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోలిస్తే.. 2020-21 క్యూ2లో భారీగా 74.63 క్షీణతతో..1,80,899 నుంచి 45,902 యూనిట్లకు పడిపోయాయి.
- అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. 2019-20 ఇదే సమయంతో పోలిస్తే 56,51,459 యూనిట్ల నుంచి స్వల్పంగా 55,96,223కు తగ్గాయి.
పండుగ సీజన్ నేపథ్యంలో వాహన విక్రయాలు ఇంకా భారీగా పెరుగుతాయని ఆశాభావంగా ఉన్నట్లు సియామ్ అధ్యక్షుడు కెనిచి అయుకవా తెలిపారు.