వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. బ్యాంకింగ్, లోహ, ఫార్మా, వాహనరంగ షేర్ల కొనుగోళ్ల అండతో జనవరి డెరివేటివ్ సిరీస్ భారీ లాభాలను మూటగట్టుకుంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 411 పాయింట్లు వృద్ధి చెంది 41 వేల 575 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12 వేల 245 వద్ద స్థిరపడింది.
రుణదాతల (బ్యాంకులు) ఆర్థిక పనితీరును, వారి వ్యాపార వృద్ధిని సమీక్షించడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. ఇందులో నిరర్థక ఆస్తుల రికవరీ, బ్యాంకుల రుణ సామర్థ్యం పెంపుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ సానుకూల అంచనాలతో ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాభనష్టాల్లో
యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్ప్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ రాణించాయి.
ఎస్ బ్యాంకు, విప్రో, బ్రిటానియా, కోటక్ మహీంద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్ కంపెనీ, ఆల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.