కరోనా భయాలతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వైరస్ మళ్లీ విజృంభిస్తుండటం వల్ల ప్రపంచ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇవే ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీల నష్టానికీ కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి.. 33 వేల 229 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 857 పాయింట్లు పతనమైందీ సూచీ.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 159 పాయింట్ల నష్టంతో 9 వేల 814 వద్ద సెషన్‌ను ముగించింది.
ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు మినహా మిగతా రంగాలన్నీ భారీగా నష్టపోయాయి.
ఇండస్‌ఇండ్‌కు నష్టాలు.. రిలయన్స్‌కు లాభాలు
సెన్సెక్స్ ప్యాక్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా నష్టపోయింది. దాదాపు 7 శాతం క్షీణించింది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ రాణించాయి.
చైనా, అమెరికాల్లో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థపై మదుపరులకు భయాందోళనలు నెలకొన్నాయి. ఇదే వారి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు అంటున్నారు.
అక్కడా కరోనా భయాలే..
షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ సూచీలు 4 శాతానికిపైగా నష్టాలను నమోదుచేశాయి. ఐరోపా మార్కెట్లూ నష్టాల్లో ట్రేడయ్యాయి.
ముడిచమురు ధరల సూచీ బ్రెంట్.. 0.93 శాతం క్షీణించి బ్యారెల్‌కు 38.37 డాలర్లకు చేరింది.