స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని.. 40,625 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 3 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 11,934 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది.
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం, ఆగస్టులోనూ పారిశ్రామికోత్పత్తి తేరుకోలేదన్న గణాంకాలతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. దీనితో వారు అమ్మకాలవైపు మొగ్గు చూపడం వల్ల మంగళవారం సెషన్ మొత్తం ఒడుదొడుకుల్లో సాగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రిలయన్స్, హెచ్‌సీఎల్‌టెక్ వంటి షేర్లు లాభాలను నమోదు చేయడం వల్ల.. సూచీలు చివరకు సానుకూలంగా ముగిసినట్లు విశ్లేషిస్తున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 40,787 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,462 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,988 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్‌టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.