స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో దూసుకెళ్లాయి. గురువారం సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 429 పాయింట్లు బలపడి.. 35,844 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 122 పాయింట్ల వృద్ధితో 10,552 వద్దకు చేరింది.
లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. మే నెలతో పోలిస్తే జూన్లో వాహన విక్రయాలు కాస్త పెరగటం సానుకూల ప్రభావం చూపింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు, ఐటీ షేర్లు రాణించడం కూడా గురువారం లాభాలకు ప్రధాన కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 36,015 పాయింట్ల అత్యధిక స్థాయి, 35,595 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,598 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 10,485 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.