స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 47,354 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,873 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, టెక్ కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 900 బిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీపై సంతకం చేయడం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఈ ప్రభావంతో మార్కెట్లు దూసుకెళ్లినట్లు విశ్లేషకుల చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 47,406 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 47,148 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,885 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల గరిష్ఠం), 13,811 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.