తెలంగాణ

telangana

ETV Bharat / business

బేర్ విజృంభణ- సెన్సెక్స్​ 2,400 పాయింట్ల పతనం - లాభ నష్టాలు

stocks
కరోనా భయాలతో భారీ నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Mar 9, 2020, 9:39 AM IST

Updated : Mar 9, 2020, 2:42 PM IST

14:36 March 09

స్వల్పంగా కోలుకున్న సెన్సెక్స్

ఒకానొక దశలో 2400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 400 పాయింట్ల మేర బలపడింది. ప్రస్తుతం 1998 పాయింట్ల నష్టంతో 35, 578 వద్ద ట్రేడవుతోంది. స్పైస్​ జెట్, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్​జీసీ, వినతి ఆర్గానిక్స్, బాంబే సిరామిక్స్, జీ లిమిటెడ్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

13:11 March 09

2,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్​

బేర్​ విజృంభణతో స్టాక్ మార్కెట్ల పతనం అంతకంతకూ పెరుగుతోంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 2,421 పాయింట్లు పడిపోయి 35,155 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 648 పాయింట్లు నష్టపోయి 10,341కు పడిపోయింది.  

చమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో పశ్చిమ ఆసియా దేశాల స్టాక్​ మార్కెట్లు ప్రారంభ సెషన్​లో కుప్పకూలాయి. కువైట్ ప్రీమియర్ సూచీ​ 9.5శాతం పతనం కావటం వల్ల ట్రేడింగ్​ను నిలిపేశారు. దుబాయ్​ ఫినాన్షియల్​ మార్కెట్​ 9శాతం, అబుదబీ సెక్యురిటీస్ ఎక్స్ఛేంజి 7.1 శాతం పడిపోయాయి.  

భారీ నష్టాల్లో కొనసాగుతున్న ఆసియా మార్కెట్లు

  • ఆసియా మార్కెట్ల ప్రభావంతో భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
  • అంతర్జాతీయ మార్కెట్‌లో 28 శాతం పడిపోయిన చమురు ధరలు
  • 20 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన చమురు ధర
  • స్టాక్‌ మార్కెట్లు, చమురు ధరలపై ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్‌ ప్రభావం

12:35 March 09

మెరుగైన ఎస్​ బ్యాంకు షేర్లు

49 శాతం వాటా కొనుగోలు చేస్తామన్న ఎస్బీఐ ప్రకటన తర్వాత ఎస్​ బ్యాంకు షేర్లు కోలుకుంటున్నాయి. బీఎస్​ఈలో 37 శాతం, ఎన్​ఎస్​ఈలో 38 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఎస్బీఐ షేర్లు 4.38 శాతం పడిపోయాయి.  

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే సాగుతున్నాయి. సెన్సెక్స్​ 1608 పాయింట్లను కోల్పోయి 35,971 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 445 పాయింట్లు క్షీణించి 10,544 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

11:56 March 09

5 లక్షల కోట్లు ఆవిరి..

వరుసగా రెండోరోజు మదుపరులు భారీగా నష్టపోయారు. ప్రారంభ సెషన్​లో సెన్సెక్స్​ 1,500, నిఫ్టీ 410 పాయింట్ల మేర నష్టపోవటం వల్ల మదుపరులు రూ.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.  

కరోనా భయాలతో స్టాక్​ మార్కెట్లు రికార్డు స్థాయి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 1,636 పాయింట్లు క్షీణించి 35,955 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 458 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,532 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్​జీసీ, రిలయన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​,  టీసీఎస్​, టాటాస్టీల్​, ఎల్​ అండ్​ టీ భారీ నష్టాల్లో ఉన్నాయి. 

11:03 March 09

స్టాక్ మార్కెట్లు భారీగా పతనం

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 1653 పాయింట్ల మేర పతనమై 52 వారాల కనిష్ఠం 35, 923 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక దశలో 1715 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. 

10:27 March 09

భారీగా పతనమైన చమురు ధరలు...

అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడమే దీనికి కారణం. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 26శాతం కుంగి బ్యారెల్‌ 33.66 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ 27 శాతం నష్టపోయి బ్యారెల్‌ 30.35 డాలర్లకు చేరింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్ దేశాలు), రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలన్న అంశంపై చర్చలు జరిగాయి. కానీ, అవి విఫలం కావడంతో సౌదీఅరేబియా గతవారం చమురు ధరలు భారీగా తగ్గించింది. ఎక్కువ మార్కెట్‌ను ఒడిసిపట్టాలన్న వ్యూహంతోనే సౌదీ ఈ చర్యలకు ఉపక్రమించింది. రానున్న రోజుల్లో సౌదీ చమురు శుద్ధి సంస్థ ఆరామ్‌కో ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే చమురు ధరలు మరింత కిందకి రావడం ఖాయం. 

10:18 March 09

ముడిచమురు ధరల పతనం.. మార్కెట్లకు నష్టాలు

ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుండటం కారణంగా మదుపరుల్లో నెలకొన్న ఆందోళనలు, ముడిచమురు ధరల్లో 30 శాతం మేర క్షీణించడం కారణంగా స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1452 పాయింట్లు కోల్పోయి 36,124 వద్ద ఉంది.  జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ  406 క్షీణించి 10, 582 గా ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో  

ఎస్​బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, స్పైస్ జెట్, ఎంఆర్​పీఎల్, ఐఓసీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్​జీసీ, రిలయన్స్ ఇన్​ఫ్రా, ఎల్ అండ్ టీ, ఇండస్​ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి క్షీణత

డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు క్షీణించి 74 గా ఉంది.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై మార్కెట్ 2 శాతం, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు 3 శాతం, టోక్యో సూచీ 5 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:34 March 09

52 వారాల కనిష్ఠానికి సెన్సెక్స్​ పతనం

కరోనా భయాలతో స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 1200పాయింట్లకుపైగా కోల్పోయింది. 36 వేల 300 దిగువకు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 350 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 10 వేల 600 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ ఏడు నెలల కనిష్ఠానికి పడిపోవడం గమనార్హం.

ఆటో, బ్యాంకింగ్​, ఇన్​ఫ్రా, ఐటీ రంగాలన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : Mar 9, 2020, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details