ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కొవిడ్-19 తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఈ పాలసీలు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ వయసు వారికి ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ నప్పుతుంది.. పాలసీ తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
20 ఏళ్ల వయసులో..
చిన్న వయసులో ఉన్నాం.. మాకేం అవుతుందన్న ధోరణిలో చాలామంది 20 ఏళ్ల యువత ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకురారు. కానీ, ఇప్పుడున్న జీవన శైలి వల్ల అనారోగ్యం బారిన పడుతున్న వారిలో 20-30 ఏళ్లలోపు వారూ అధికంగానే ఉంటున్నారన్నది వాస్తవం. అందుకే, ఈ వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మేలు. దీనివల్ల ఇతర ప్రయోజనాలూ ఉంటాయి. ముందస్తు వ్యాధులు ఉండే అవకాశం తక్కువే కాబట్టి, భవిష్యత్తులో వేచి ఉండే సమయంలాంటివి ఉండదు. ఆరోగ్య పరీక్షలూ పెద్దగా అవసరం పడదు. అనారోగ్యం బారిన పడకున్నా.. ప్రమాదాలు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లోనూ ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంటుంది. కొత్త తరం అంతా డిజిటల్‌నే ఇష్టపడుతున్నారు కాబట్టి, ఆరోగ్య బీమా పాలసీలనూ వీరు సులభంగా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. ఈ వయసు వారు ఇండెమ్నిటీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఓపీడీ చికిత్సలకూ వర్తించేలా పాలసీ ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ.. పాలసీ విలువా అధికమయ్యే పాలసీని ఎంచుకోవాలి.
30 -40 ఏళ్ల మధ్యలో..
ఈ వయసులో బాధ్యతల బరువు అధికంగా ఉంటుంది. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరగడం, వ్యాయామం లోపించడం, కాలుష్యం, అనారోగ్య ఆహార అలవాట్లు ఇలా పలు కారణాల వల్ల అనారోగ్యం తరచూ పలకరిస్తూ ఉంటుంది. ఈ వయసులోఉన్నవారు.. తమతోపాటు, తన కుటుంబానికీ తగినంత ఆరోగ్య బీమా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కుటుంబం అంతటికీ కలిపి కనీసం రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, టాపప్ పాలసీనీ తీసుకోవాలి. ప్రసూతి ఖర్చులను చెల్లిస్తారా? నవజాత శిశువుకు రక్షణ లభిస్తుందా? చూసుకోండి. వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ప్లాన్‌లాంటివీ తీసుకోవాలి. అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ లభించేలా బీమా పాలసీ తీసుకోవడమూ ముఖ్యమేనని గుర్తుంచుకోండి.