స్టాక్‌మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి నగదు విభాగంలో సెబీ ప్రతిపాదించిన నూతన మార్జిన్ల విధానం స్టాక్‌బ్రోకింగ్ వర్గాల్లో, మదుపరుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లావాదేవీలకు మదుపరుల నుంచి ముందుగానే 'మార్జిన్' వసూలు చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. లోపాలకు అస్కారం లేకుండా.. అదే సమయంలో పారదర్శకత పెరగాలనే ఉద్దేశంలో నగదు విభాగానికి నూతన మార్జిన్ల వసూలు విధానాన్ని సెబీ ప్రతిపాదించింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రావాలి. దానికి తాము సిద్ధంగా లేమని బ్రోకింగ్ సంస్థలు చెబుతున్నాయి. దీంతో సంబంధిత వర్గాలతో సోమవారం సెబీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. స్టాక్ బ్రోకర్లు కోరుకున్నట్లుగా పొడిగింపు లభిస్తుందా, లేక కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందా.? అనేది ఆరోజు తేలిపోతుంది.
ఎన్నో మార్పులు..
- మదుపరులు తాము కొనుగోలు చేసే షేర్లకు ఎంత సొమ్ము ముందుగా చెల్లించాలి...అనేది నిర్దేశించేదే మార్జిన్ల విధానం. బ్రోకరేజీ సంస్థలు మదుపరుల ‘ఆర్డర్ల’ మేరకు ముందుగా తమ సొమ్ముతో షేర్లు కొనుగోలు చేసి, తర్వాత ఆ సొమ్ము మదుపరుల నుంచి తీసుకునే సంప్రదాయం ఇంతవరకూ ఉంది. నూతన విధానం అమల్లోకి వస్తే అది కుదరదు.
- దీనివల్ల ‘ట్రేడింగ్ వాల్యూమ్స్’ గణనీయంగా తగ్గిపోతాయని, తమ వ్యాపార పరిమాణం క్షీణిస్తుందని బ్రోకింగ్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
- ఒక కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలిస్తే, వెంటనే ఆ షేర్ కొనాలనుకుంటాం... ఎప్పుడు వస్తుందో తెలియని అటువంటి సందర్భం కోసం ముందుగానే ట్రేడింగ్ ఖాతాలో సొమ్ము నిల్వ ఉంచలేం కదా... అని మదుపర్లు సైతం వాపోతున్నారు.
- ఇప్పటి వరకూ మదుపరులు తమ ఖాతాలో ఒక కంపెనీ షేర్లు విక్రయిస్తే, ఆ షేర్లకు విలువకు సమానంగా మరో కంపెనీ షేర్లు కొనుగోలు చేసే అవకాశం అప్పటికప్పుడు లభిస్తుంది. ఇకపై ఇది కుదరదు.
- మదుపరుల ఖాతాల్లో ఉన్న షేర్లను ‘మార్జిన్’ కింద స్టాక్ బ్రోకర్ల ఖాతాలకు బదిలీ చేస్తే... ఆ మేరకు లిమిట్స్ (కొనుగోలు పరిమితి) ఇచ్చే అవకాశం ఇప్పటి వరకూ ఉంది. దీనికి బదులు ఎస్‌ఎంఎస్/ ఇమెయిల్/ ఓటీపీ ఆధారిత కొత్త విధానాన్ని సెబీ ప్రతిపాదించింది. బీటీఎస్ (బై టుడే- సెల్ టుమారో) విధానం కూడా నూతన పద్ధతిలో సాధ్యం కాదు.