కార్లైల్ గ్రూప్‌తో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రతిపాదిత రూ.4,000 కోట్ల ఒప్పంద ప్రతిపాదనపై వాటాదార్ల ఓటింగ్ ఈ నెల 22న జరగాల్సి ఉండగా, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జోక్యం చేసుకుంది. ఈ ప్రక్రియను ఆపివేయడం సహా చట్టబద్ధంగా కంపెనీ విలువ మదింపు ప్రక్రియ చేపట్టాలని పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌ను ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అనుబంధ సంస్థగా కొనసాగుతున్న పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌ను ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజమైన కార్లైల్ గ్రూప్ క్రమంగా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు.. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ స్టేక్‌హోల్డర్స్ ఎంపవర్‌మెంట్ సర్వీసెస్‌తో (ఎస్‌ఈఎస్) సహా పలువురి ఫిర్యాదు మేరకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.
పీఎన్‌బీ, కార్లైల్ ఒప్పందానికి సెబీ అడ్డు - సెబీ
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, కార్లైల్ సంస్థల ప్రతిపాదిత రూ.4వేల కోట్ల ఒప్పందానికి సెబీ బ్రేకులు వేసింది. ఈ ప్రతిపాదనపై వాటాదార్ల ఓటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.
పీఎన్‌బీ కావాలనే సరైన విలువను మదింపు చేయకుండా హౌసింగ్ సంస్థ నియంత్రణ అధికారాలను కార్లైల్ గ్రూప్‌కు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందనే అనుమానాలు ఉన్నాయని ఎస్‌ఈఎస్ ప్రస్తావించింది. కంపెనీ ఆర్టికల్ ఆఫ్ ఆసోసియేషన్‌కు (ఏఓఏ) భిన్నంగా స్వతంత్ర నమోదిత వాల్యుయర్ మదింపు జరగకుండా ప్రిఫరెన్షియల్ కేటాయింపునకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఒప్పందం కుదుర్చుకోవడం చట్టప్రకారం సరైంది కాదని పేర్కొంది. ప్రతిపాదిత ఒప్పందం ద్వారా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.3,200 కోట్లు, వారెంట్ల జారీ ద్వారా రూ.800 కోట్లు సమీకరించాలని పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ భావిస్తోంది.