సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో లోపాలు ఉన్నాయంటూ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది.
ఏంటీ ఏజీఆర్ వివాదం?
జాతీయ టెలికాం విధానం-1994 ప్రకారం టెలికాం రంగాన్ని సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటినుంచి సంస్థలకు లైసెన్సులను జారీ చేయటం మొదలుపెట్టింది. అంతకుముందు స్థిరమైన లైసెన్సు రుసుము ఉండేది.
1999లో ఆదాయ బదిలీ విధానానికి మారేందుకు టెలికాం విభాగం టెల్కోలకు అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం టెల్కోల 'సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)'లోని కొంత మొత్తాన్ని వార్షిక లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ రుసుముగా ప్రభుత్వానికి చెల్లించాలి.