రిలయన్స్ కమ్యునికేషన్(ఆర్‌కామ్) స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకొని ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ.. రిలయన్స్ జియోను ఏజీఆర్ బకాయిలు చెల్లించాలని ఎందుకు అడగటం లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్‌కామ్‌కు సంబంధించిన సంవత్సరంవారీ బకాయిలు కోర్టుకు సమర్పించాలని కేంద్ర టెలికాం శాఖను ఆదేశించింది.
ఆర్‌కామ్ ఎప్పటి నుంచి బకాయిలు చెల్లించడం లేదో తెలిపే వివరాలను తమకు అందజేయాలని టెలికాం శాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ఇచ్చేందుకు ఇవే కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అనంతరం వాదనలు ఆగస్టు 18కి వాయిదా వేసింది.
మంత్రిత్వ శాఖల మధ్య అభిప్రాయబేధం
మరోవైపు, దివాలా సమయంలో స్పెక్ట్రమ్ అమ్మకాలపై రెండు మంత్రిత్వ శాఖల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దివాలా సమయంలో స్పెక్ట్రమ్ అమ్మకాలు జరపకూడదని టెలికాం శాఖ చెబుతుంటే.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాత్రం విలువ పెంచేందుకు స్పెక్ట్రమ్ అమ్మకాలకు అనుమతించాలని స్పష్టం చేస్తోందని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.