Amazon Future Deal: అమెజాన్- ఫ్యూచర్ గ్రూప్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఇరు పక్షాలూ నేషనల్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని పేర్కొంది. ఈ డీల్ చెల్లుబాటు కాదంటూ కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను త్వరగా తేల్చాల్సిందిగా ఎన్సీఎల్ఏటీను కోరాలని తన సూచనల్లో పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మార్చి 9కి బెంచ్ వాయిదా వేసింది.
ఫ్యూచర్ రిటైల్‌ను.. రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేసేందుకు సంబంధించి రూ.24,500 కోట్ల విలువైన డీల్‌పై మధ్యవర్తిత్వానికి వెళ్లకుండా స్టే ఇవ్వాలన్న ఫ్యూచర్ గ్రూప్ విజ్ఞాపనపై దిల్లీ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. ఫ్యూచర్ గ్రూప్‌కు అనుకూలంగా మధ్యవర్తిత్వంపై స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ అమెజాన్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం చెల్లుబాటు కాదంటూ డిసెంబర్ 17న సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెజాన్ ఎన్సీఎల్ఏటీను సైతం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలైన పిటిషన్‌కు అనుసంధానమై ఉంది కాబట్టి రెండు పార్టీలూ ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీను కోరాలని బెంచ్ సూచించింది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.
నేపథ్యమిదీ..