బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31కు ముందు విక్రయించిన, ఈ-వాహన్ పోర్టల్‌లో నమోదు అయిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించింది. పోర్టల్‌లో నమోదు కాని, మార్చి 31 తర్వాత విక్రయించిన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించడం లేదని పేర్కొంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌కు ఈ ఉత్తర్వులు వర్తించబోవని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో మార్చి 31 కంటే ముందు వాహనాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయిన వారికి ఊరట కలగనుంది.
ఇటీవల రిజిస్ట్రేషన్ల నిలిపివేత
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో అసాధారణ రీతిలో జరిగిన ఆ వాహన విక్రయాల అంశం తేలే వరకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో మార్చి చివర్లో, ఆ తర్వాత పెద్దఎత్తున ఈ తరహా వాహన విక్రయాలు చేపట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చింది.