స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ఎస్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
దీంతో పాటు 20-100బేసిస్ పాయింట్ల మధ్య ఉన్న రిటైల్, పెద్ద మొత్తంలోని డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఓ ప్రకటన చేసింది ఎస్బీఐ.
" ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించేందుకు ఆర్బీఐ అసాధారణ ద్రవ్య విధాన చర్యలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి 75 బెసిస్ పాయింట్ల రెపో రేట్ కోతను ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత లెండింగ్ రేటు (ఈబీఆర్)తో పాటు రెపో ఆధారిత లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలకు వర్తింప చేయనున్నాం."