SBI Mutual Fund IPO: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన మ్యూచువల్ ఫండ్ సంయుక్త సంస్థను కూడా స్టాక్ మార్కెట్‌లో నమోదు చేసే దిశగా మరో ముందడుగు వేసింది. ఐపీఓ ప్రతిపాదనకు తాజాగా బోర్డు ఆమోదం లభించింది. దీంతో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌బీఐఎఫ్‌ఎంపీఎల్)లో ఉన్న 6 శాతం వాటాను ఎస్‌బీఐ ఐపీఓ ద్వారా విక్రయించడం లాంఛనమైంది.
జీవితబీమా, ఎస్‌బీఐ కార్డ్స్ వ్యాపారాల్ని గత ఏడాది నమోదు చేయడం వల్ల ఎస్‌బీఐ అధిక విలువను పొందిందని, ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ సంస్థను కూడా నమోదు చేస్తే మంచిదనే అభిప్రాయంలో ఎస్‌బీఐ ఉన్నట్లు సమాచారం. ఎస్‌బీఐ, అమండి అసెట్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థే ఎస్‌బీఐఎఫ్‌ఎంపీఎల్. అయితే, తాజా ఐపీఓలో అమండి కూడా తన వాటాలను ఏమైనా విక్రయిస్తుందా? అనే విషయాన్ని ఎస్‌బీఐ వెల్లడించలేదు.