ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆరోగ్య బీమా(Health Insurance) పాలసీలను కస్టమర్లకు అందించేందుకు గూగుల్‌పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గూగుల్‌పే యాప్ ద్వారా ఇంటి నుంచే ఎటువంటి అవాంతరాలు లేకుండా, త్వరితగతిన ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోని బీమా సంస్థతో.. గూగుల్ పే జతకట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. కస్టమర్లు ఇకపై గూగుల్‌పే స్పాట్‌లో క్షణాల్లో ఆరోగ్య బీమా కొనుగోలు చేయచ్చు. ఇక్కడ ఆరోగ్య బీమా పాలసీని ఎస్‌బీఐ జనరల్ ఇన్సురెన్స్ సంస్థ అందిస్తుంది. గూగుల్ పే టెక్నికల్ సర్వీస్‌ను మాత్రమే అందిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో వినయోగదారులకు తమ అవసరాల గురించి పూర్తి అవగాహన ఉంది. కొవిడ్-19 కారణంగా డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. కరెంటు బిల్లుల దగ్గర నుంచి బ్యాంకు లావాదేవీలు వరకు అన్ని ఆర్థిక పరమైన అవసరాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సాంకేతిక పరిష్కారం లభించింది. చాలావరకు చెల్లింపులు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంటి నుంచే చేయగలుగుతున్నాము.