దేశంలో వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. తన మూడు శాఖలను తాత్కాలికంగా మూసివేసింది. మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 8 మంది బ్యాంక్ సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని రెండు బ్రాంచ్‌లు సహా.. ఠానే సమీపంలోని ఓ శాఖను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ.
గతవారం ఠానేలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధాన శాఖలో పనిచేస్తోన్న 25 మందిలో ఏడుగురు సిబ్బందికి వైరస్ సోకగా బ్యాంక్‌ను మూసివేశారు.
నిత్యం పర్యవేక్షణలో..
తమ సంస్థ ఉద్యోగుల్లో వైరస్ బాధితులు ఎక్కువవుతున్నారని పేర్కొంది ఎస్బీఐ. అయితే వారు కోలుకుంటున్నారని తెలిపింది. ఇందుకోసం ఎస్బీఐ జనరల్ మేనేజర్ అధ్వర్యంలోని ఓ బృందం.. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటిస్తున్నట్లు చెప్పింది.