ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల అవసరాలను తీర్చేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. వారి జీవితంలో ప్రతీదీ ప్రత్యేకంగా,ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. వారి సంతోషం కోసం ప్రతి పనిని ఒక క్రమపద్ధతిలో చేస్తుంటారు. చదువు, ఇల్లు, వారి చుట్టూ ఉండే వాతావారణం ఇలా ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం పొదుపు, పెట్టుబడులు చేస్తుంటారు. అయితే పెట్టుబడులలో చేసే తప్పుల వల్ల సమయం వచ్చినప్పుడు, తల్లిదండ్రులు చేసిన పొదుపు, పెట్టుబడులు వారి విద్యా, వివాహం వంటి వాటికి సరిపోకపోవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం చేసే పొదుపు లేదా పెట్టుబడులలో సాధారణంగా చేసే 5 తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్‌డ్ డిపాజిట్:
చాలావరకు తల్లిదండ్రులు చేసే మొదటి తప్పు వారి పిల్లల విద్య, వివాహం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం. పిల్లల భవిష్యత్తు కోసం ఇది అత్యుత్తమ మార్గంగా పరిగణిస్తారు. అయితే, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుంది. పిల్లల కోసం చేసే పొదుపులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను చిట్టచివరి ఎంపికగా పరిగణించాలి. మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఎంత రాబడి వస్తుంది? గరిష్టంగా 8 నుంచి 9 శాతం రాబడి ఉంటుంది. 30 శాతం పన్ను బ్రాకెట్‌లో ఉంటే రాబడి 6 నుంచి 7 శాతంగా ఉండొచ్చు.
ఇప్పడు పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చవుతుంతో చూద్దాం!
ఉదాహరణకు ఎమ్‌బీఏ డిగ్రీ ఖర్చు:
ఐఐఎమ్ అహ్మాదాబాద్‌లో ఎమ్‌బీఏ కోర్సు రుసుము 2007లో రూ.5 లక్షలు, అదే ఎమ్‌బీఏ కోర్సు రుసుము ప్రస్తుతం రూ.19.5 లక్షలు, గత 10 సంవత్సరాలలో దాదాపు 400 శాతం మేర ఖర్చు పెరిగింది. ఐఐఎమ్ అహ్మాదాబాద్‌లో రుసుముల సగటు పర్సంటేజ్‌లో మార్పు 10 శాతం కంటే ఎక్కువ. ఈ పెరుగుతున్న విద్యా రుసుముల ఆధారంగా 10 సంవత్సరాల తరువాత అదే ఎమ్‌బీఐ ఖర్చు దాదాపు రూ. 50 లక్షలు ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలను 2026లో ఐఐఎమ్ అహ్మాదాబాద్‌లో చదివించాలి అనుకుంటే మీకు అప్పటికీ రూ. 50 లక్షలు అవసరం అవుతుంది. ఈ మొత్తాన్ని ఫిక్స్ఢ్ డిపాజిట్ల ద్వారా పొందాలంటే ఈరోజు రూ.27 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. ఇది మాత్రమే కాకుండా ప్రతీ సంవత్సరం పిల్లల స్కూలు ఫీజులు ఉంటాయి. ఇవి ప్రతీ సంవత్సరం దాదాపు 10 శాతం పెరుగుతుంటాయి. ఈ కాలవ్యవధిలో పెరుగుతున్న విద్యా ఖర్చులతో సమాసంగా ఎఫ్‌డీలలో రాబడి శాతం పెరగదు. కనుక పిల్లల కోసం ఆదా చేసేందుకు ఇది సరైన మార్గం కాదు.
2. తగినంత పొదుపు చేయలేకపోవడం:
సాధారణంగా భారతదేశంలో ఉన్న ప్రజలకు పెరుగుతున్న విద్యా ఖర్చుల గురించి సరైన అవగాహన లేదు. తల్లిదండ్రులకు వారి పిల్లల కోసం పొదుపు చేయాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఎంత మొత్తం పొదుపు చేయాలనేది చాలా మందికి తెలియదనే చెప్పాలి. ప్రస్తుత విద్యా రుసుములు, పెళ్లి ఖర్చుల ఆధారంగా పొదుపు చేస్తుంటారు. ఈ ఖర్చులపై భవిష్యత్తు ద్రవ్యోల్బణాన్ని లెక్కించరు.
పిల్లల విద్యకు సరిపోయే మొత్తాన్ని పొదుపు చేయలేకపోవడానికి మరొక కారణం జీవన వ్యయాలు, ఊహించని ఖర్చులు. మధ్యతరగతి తల్లిదండ్రులు నెలవారీ గృహ ఖర్చులను అధిగమించడమే కష్టతరంగా ఉంటుంది. అందువల్ల వారి పిల్లల భవిష్యత్తు కోసం తగిన పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు.