గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆదాయం పెరిగింది. ఆర్జించే వారి సంఖ్యా పెరిగింది. పొదుపు మాత్రం పాతకాలం సూత్రంగానే మిగిలిపోయింది. ఖర్చు చేస్తే వస్తున్న కిక్కు ముందు రేపెలా? అనే ఆలోచన వెలవెలబోతోంది. ఏటికేడు దేశంలో పొదుపు శాతం గణనీయంగా తగ్గుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వచ్చేదంతా..ఖర్చులకేనా!
ఒకప్పుడు.. రూ. 100 ఆదాయం వస్తే.. రూ. 75 ఖర్చు చేసి, మిగతాది దాయడం అలవాటుగా ఉండేది మనకు. పదేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రపంచలోని పలు దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. మనదేశంపై ఆ ప్రభావం నామమాత్రంగానే ఉంది. అందుకు కారణం ఇక్కడి ప్రజల్లో పొదుపు అలవాటు ఎక్కువగా ఉండటమేననే విశ్లేషణలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ పొదుపు అదుపు తప్పుతోంది. చాలామంది ఆదాయమే కాదు.. అప్పు చేసి ఖర్చులు పెట్టేందుకూ సిద్ధమవుతున్నారు.పాశ్చాత్య దేశాల్లో ప్రజలు సాధారణంగా వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేసేస్తారు. రేపటి గురించి పెద్దగా పట్టించుకోరు. విదేశీ సంస్కృతి బలంగా మన దేశంలోకి వచ్చి చేరుతున్న ప్రస్తుత తరుణంలో మనకూ అలాంటి దుబారా ఖర్చుల తీరు అలవాటైపోతోంది!!
గతంతో పోలిస్తే.. ఇప్పుడు రుణాలు తీసుకొంటున్న వారి సంఖ్య ఎక్కువైంది. ఇందులో ఎక్కువగా గృహ రుణాలు ఉంటున్నాయి. దీంతోపాటు క్రెడిట్ కార్డుల వాడకమూ పెరిగింది. హామీ లేకుండా తీసుకునే వ్యక్తిగత రుణాలు గత ఐదారేళ్లలో మూడు రెట్లు పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.76 లక్షల కోట్ల హామీ లేని రుణాలు తీసుకోగా.. 2017-18లో ఇవి దాదాపు రూ. 5.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే.. వ్యక్తులు ఆస్తులను సృష్టించే వాటికన్నా.. ఖర్చులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం అవుతోంది. వడ్డీ రేట్లు తగ్గడం, సులువుగా రుణాలు లభిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రపంచంలోనే అధికంగా పొదుపు చేసే అలవాటున్న భారతదేశం గత ఐదారేళ్లుగా ఆ పేరును క్రమంగా కోల్పోతోంది. జీవన శైలి ఖర్చులు పెరగడం.. ఆదాయాలు అదే నిష్పత్తిలో పెరగకపోవడం వల్ల పొదుపు, పెట్టుబడులు తగ్గుతున్నాయి.
అత్యవసర నిధి ఎందరి దగ్గరుంది?
ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో చెప్పలేం. జీతం వచ్చేదాకా ఆ అవసరాన్ని వాయిదా వేయలేం. అనుకోకుండా ఉద్యోగం పోయినా.. ఏదైనా అనారోగ్యం ఏర్పడినా.. ఖర్చులకు తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి కష్ట సమయాల్లో ఆదుకునేందుకు కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవడం మంచిది.