ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామన్న సౌదీ అరేబియా తాజా ప్రకటనతో చమురు ధరలు మరింత క్షీణించాయి. డబ్ల్యూటీఐ, బ్రెంట్ క్రూడ్ ధరలు 1.7 శాతం పడిపోయి వరుసగా 33, 36 డాలర్లకు దిగజారాయి.
రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు ధరల యుద్ధంతో కొద్ది రోజులుగా క్రూడ్ ధరలు భారీగా పతనమయ్యాయి. సోమవారం ఏకంగా 30 శాతం తగ్గి.. 1991 తర్వాత ఆ స్థాయిలో పతనాన్ని చూశాయి.
కరోనా వైరస్ ప్రభావంతో మందగమనం వైపు దూసుకెళుతున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఫలితంగా మంగళవారం చమురు ధరలు 6 శాతం పెరిగాయి.
ఆరాంకో ప్రకటన తర్వాత..
అయితే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు చమురు దిగ్గజం సౌదీ ఆరాంకో చేసిన ప్రకటనతో మళ్లీ క్రూడ్ నేలచూపులు చూసింది. ప్రస్తుతం రోజుకు గరిష్ఠంగా 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది ఆరాంకో. అదనంగా మరో 1 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని పెంచాలని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆరాంకో తెలిపింది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత చమురు ధరలు మళ్లీ భారీగా పడిపోతున్నాయి.