మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల (Satya Nadella) జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి. నేటి పిల్లల్లాగే.. ఆరోజుల్లో కూడా సత్య కూడా ఐఐటీలో సీటు కోసం కలలు కన్నాడు. కానీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. మణిపాల్ వర్సిటీ నుంచి.. బీటెక్ పూర్తి చేసిన సత్య ఎన్నడూ తాను ఐఐటియన్ కాదని బాధపడలేదు. తన జర్నీ ఆపిందీ లేదు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అయ్యాడంటే.. ఏ హార్వర్డ్‌లోనో చదివి ఉంటాడనుకుంటే కూడా పొరపాటు! అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. పూర్తి చేసిన సత్య (Satya Nadella).. కాలేజీ బ్రాండ్‌ల మీద ఆధారపడకుండా.. తన పని బ్రాండ్‌ను నమ్ముకుని సాగారు! మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు.. మన లక్ష్యమేంటి? దాన్ని సాధించే మార్గమేంటన్నది ప్రధానం.
ఆ మంత్రం జపిస్తే చాలు..
తనకంటే మంచి యూనివర్సిటీల్లో చదివి వచ్చిన వారున్నా.. మన సత్యనే మైక్రోసాఫ్ట్ ఉన్నతాసనం ఎందుకు వరించింది? మైక్రోసాఫ్ట్‌లో అంచలంచెలుగా సత్య ఎలా ఎదిగారు? అందుకు దోహదం చేసిందేంటి.. అంటే.. సమాధానం- ఆయన రోజూ చేసే జపం.. నిత్యం పఠించే మంత్రం ఒకటుంది! అదే "ఈ ప్రపంచానికి పనికొచ్చే పనిచేద్దాం!" అదే ఆయనపై బిల్‌గేట్స్ మనసు పడేలా చేసింది. ఈరోజు మామూలు ఉద్యోగి నుంచి ఛైర్మన్‌గా ఎదిగేలా చేసింది! తనకప్పగించిన ప్రతి పనినీ విభిన్నంగా ఆలోచించి.. వినూత్నంగా చేయటానికి ప్రయత్నించటమే సత్య నాదెళ్లను అంచలంచెలుగా ఎదిగేలా చేసింది.
"ఈ భూప్రపంచంలోని ప్రతి ఒక్కరి జీవనం మరింత సౌకర్యవంతమయ్యేలా, ప్రతి కంపెనీ పనితీరు మెరుగయ్యేలా ఏం చేయగలమో ఆలోచించాలి. ఇందుకు అవసరమైన సాంకేతికతను మనం అభివృద్ధి చేయాలి. మన ఆవిష్కరణలు మరిన్ని కంపెనీలకు దారి చూపాలి." అంటే ప్రతి ఇంటా, ప్రతి చోటా మైక్రోసాఫ్ట్ భాగం కావటమే!" 'ప్రపంచానికి పనికొచ్చే పని చేద్దాం' అన్న ఆ మంత్రమే మైక్రోసాఫ్ట్‌లో సత్యను ప్రపంచంలో మైక్రోసాఫ్ట్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది.
అనిశ్చితిలో బెదరకుండా..
కొన్నేళ్ళ కిందట మైక్రోసాఫ్ట్ సీఈవోగా మనోడు అనగానే మనమంతా సంబరపడి పోయాం! కానీ.. అక్కడ సత్యకు అదంత సులభమైందేమీ కాదు. తాను సీఈవోగా పదవి చేపట్టే నాటికి మైక్రోసాఫ్ట్ పరిస్థితి అంతగా బాగోలేదు. సత్య వచ్చిన వెంటనే చేసిన పని.. పడిపోతున్న దాన్ని పట్టుకోకుండా.. కొత్త అవకాశాల్ని చూశాడు. అందరికీ చూపించాడు. ఫలితంగా సంస్థ కళ్లలో కొత్త కాంతులు నింపాడు. పడిపోతున్న తమ సెల్‌ఫోన్ల మార్కెట్ గురించి అతిగా బాధపడకుండా.. రాబోతున్న క్లౌడ్ కంప్యూటింగ్‌కు దారులు వేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్‌ను వినియోగదారుల ఫ్రెండ్లీగా మలిచారు. ఫలితం.. మైక్రోసాఫ్ట్ ఈరోజు మళ్లీ కింగ్‌గా నిలబడగలిగింది. సంక్లిష్ట పరిస్థితుల్లో కంగారు పడకుండా.. నాయకుడిగా తెగించి తీసుకునే నిర్ణయాలే మనల్ని కొత్తదనం వైపు నడిపిస్తాయనటానికి నిదర్శనం మన సత్య!