భారత్లో కరోనా తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారుతున్న తరుణంలో టెక్ దిగ్గజం శాంసంగ్(Samsung India) కీలక ప్రకటన చేసింది. భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు(Samsung India recruitment) తెలిపింది. క్యాంపస్ నియామకాల ద్వారా మొత్తం 1,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రాల్లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), డీప్ లెర్నింగ్, నెట్వర్క్స్, ఇమెజ్ ప్రాసెసింగ్, డాటా అనాలసిస్, కెమెరా టెక్నాలజీస్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది.
"భారత్.. కొన్నేళ్లుగా వేగవంతమైన ఆవిష్కరణ కేంద్రంగా ఉంది. భవిష్యత్లో అవసరమైన పరిష్కారాల ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా వచ్చే ఏడాది 1000 మంది ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించుకున్నాం. దేశంలోని ఐఐటీలు, బిట్స్ పిలాని, ఎన్ఐటీ సహా దిగ్గజ ఇంజనీరింగ్ కళాశాలను నుంచి వీరిని ఎంపిక చేయనున్నాం" అని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ప్రెసిడెంట్ సమీర్ వాధవన్ పేర్కొన్నారు.