తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ దెబ్బకు 2.1 కోట్ల వేతన ఉద్యోగాల్లో కోత - ఉద్యోగాల కల్పన

కరోనా లాక్​డౌన్ కారణంగా 5 నెలల్లో 2.1 కోట్ల మంది వేతనజీవులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. అదే సమయంలో 1.4 కోట్ల మంది వ్యవసాయదారులుగా, 70 లక్షల మంది వ్యాపారవేత్తలుగా మారినట్లు పేర్కొంది.

Salaried class worst hit by Covid, over 2 crore jobs lost since lockdown
ఆగస్టు నాటికి 2.1 కోట్ల వేతన ఉద్యోగాల్లో కోత

By

Published : Sep 13, 2020, 10:52 AM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా గత ఐదు నెలలుగా చాలా కంపెనీలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటం కోసం ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ​ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా 2.1 కోట్ల మంది వేతన ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయినట్లు వెల్లడించింది 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' (సీఎంఐఈ).

2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 8.6 కోట్ల వేతన ఉద్యోగాలున్నాయి. 2020 ఆగస్టు నాటికి ఈ సంఖ్య 6.5 కోట్లకు పడిపోయింది. అంటే 2.1 కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అన్ని రకాల ఉద్యోగాలతో కలిపి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే. ప్రారంభంలో కొన్ని రకాల ఉద్యోగాలు పోయినప్పటికీ, తర్వాత మళ్లీ ఉద్యోగ కల్పన జరిగింది.

మహేశ్​ వ్యాస్​,​ సీఎంఐఈ సీఈఓ

ఉద్యోగాలు కోల్పోయిన 2.1 కోట్ల మందిలో కేవలం జీతాలు పొందే ఉద్యోగులు, సహాయక సిబ్బందే కాకుండా వృత్తి నిపుణులు కూడా ఉన్నారని వ్యాస్​ వెల్లడించారు.

రోజుకూలీలే అధికం

ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రోజువారీ కూలీలు బాగా నష్టపోయారు. ఈ నెలలో మొత్తం 12.1 కోట్ల ఉద్యోగాలకు కోత పడగా.. ఇందులో 9.1 కోట్ల మంది రోజువారీ కూలీలే ఉన్నారు. అయితే ఆగస్టు నాటికి ఇందులో చాలా వరకు ఉద్యోగాలు రికవరీ అయ్యాయి. 2019-20 గణాంకాల ప్రకారం మొత్తం 12.8 కోట్ల ఉద్యోగాల్లో లోటు కేవలం 1.1కి చేరింది.

అదే సమయంలో 2019-20 నుంచి 2020 ఆగస్టు మధ్య కాలంలో ఎక్కువ మంది వ్యవసాయదారులుగా, పారిశ్రామికవేత్తలుగా మారినట్లు సంస్థ పేర్కొంది. 1.4 కోట్ల మంది వ్యవసాయంలో, 70 లక్షల మంది కొత్త వ్యాపారవేత్తలుగా తమ జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.

వేతన ఉద్యోగం అంటే?

ఏదైనా ఓ వ్యక్తి ఓ సంస్థలో రోజూ పని చేస్తూ.. ఆ సంస్థ నుంచి నెలవారీ జీతం పొందితే దాన్ని వేతన ఉద్యోగం కింద పరిగణించవచ్చు. జీతం చెల్లించే సంస్థ ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు రంగ సంస్థ లేదా ప్రభుత్వేతర సంస్థ అయినా కావచ్చు. జీతాల ఆధారంగా ఇంట్లో పనిచేసే వంటవాడు, డ్రైవర్, తోటమాలి, గార్డ్ వంటి వారిని కూడా వేతన ఉద్యోగులుగానే పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాల్లో వేతన ఉద్యోగులు 21 నుంచి 22 శాతం మంది ఉన్నారు.

ఉద్యోగ కల్పన..

దేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారవేత్తలు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల కల్పన మాత్రం స్థిరంగానే ఉంటున్నట్లు సీఎంఐఈ అభిప్రాయపడింది.

మొత్తం శ్రామిక శక్తిలో వేతన ఉద్యోగాల వాటా.. 2016-17లో 21.2 శాతం, 2017-18లో 21.6 శాతం, 2018-19లో 21.9 శాతంగా ఉంది. ఈ సమయంలో భారత్ వార్షిక స్థూల విలువ 6 నుంచి 8 శాతానికి పెరిగింది. అలాగే 2019-20 ఆర్థిక వృద్ధి 4 శాతం పెరగగా..21.3 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు.

వ్యవస్థాపకుల సంఖ్య 2016-17లో 5.4 కోట్ల నుంచి 2019-20లో 7.8 కోట్లుకు ఎగబాకింది. అదే సమయంలో జీతం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 8.6 కోట్లతో స్థిరంగా ఉందని వ్యాస్​ తెలిపారు. దీని ద్వారా... 2016-17 నుంచి వ్యాపారవేత్తలు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగాల కల్పనలో మార్పులేదని అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వ్యాపారవేత్తల్లో చాలా మంది చిన్న పరిశ్రమలు పెట్టిన వారని.. అందువల్ల ఉద్యోగాలను కల్పించలేకపోతున్నారని వెల్లడించారు.

ప్రజలు ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాలను ఇచ్చే వ్యక్తులుగా మారాలని కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉద్దేశం చేరుకున్నట్లు కనిపించినప్పటికీ... అది పూర్తిస్థాయిలో జరగడం లేదని వ్యాస్​ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details