Russia Ukraine war impact: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పదిరోజులకు పైగా కొనసాగుతూ ఉండటంతో దేశీయ ఔషధ కంపెనీల్లో ఆందోళన కనిపిస్తోంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే ఆ 2 దేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడటంతో పాటు ఐరోపా దేశాలు, మధ్య ప్రాచ్య దేశాలకు మందుల సరఫరాకూ సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల నష్టభయం అధికమవుతుందని దిగ్గజ ఔషధ కంపెనీలు భావిస్తున్నాయి. మనదేశం నుంచి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తదితర కంపెనీలు రష్యా, ఉక్రెయిన్ దేశాలకు మందులు అధికంగా ఎగుమతి చేస్తున్నాయి. అరబిందో ఫార్మా, సిప్లా, టోరెంట్ ఫార్మా, జైడస్.. తదితర కంపెనీలు ఐరోపా దేశాలకు మందులు అందిస్తున్నాయి. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్ వి’ ని మనదేశంలో పలు కంపెనీలు పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. దీని కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయి.ఈ టీకా పంపిణీ బాధ్యతలను డాక్టర్ రెడ్డీస్ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ముప్పు తగ్గడంతో పాటు యుద్ధం నేపథ్యంలో, స్పుత్నిక్ వి టీకాను మనదేశంలో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని, ఈ ఉత్పత్తి- పంపిణీలో ఉన్న కంపెనీలకు నష్టమేనని పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి.'
మనదేశం నుంచి ఏటా 2000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్ల) విలువైన మందులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో 35 శాతం అమెరికాకు వెళ్తుంటే, తరవాత స్థానంలో ఐరోపా దేశాలున్నాయి. రష్యా, సీఐఎస్ దేశాలకూ మందుల ఎగుమతులు అధికమే. ఇప్పటికి అయితే మందుల ఎగుమతులు ఆగలేదు కానీ మున్ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదని స్థానిక ఫార్మా వర్గాలు వివరిస్తున్నాయి. నష్టం తాత్కాలికమేనని, యుద్ధం ముగిశాక వ్యాపార కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయనే ఆశాభావాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యాలో ప్రస్తుతానికి తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ సిబ్బంది మంచిచెడులను జాగ్రత్తగా చూస్తున్నట్లు ఔషధ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
రవాణా వ్యయాలు పెరిగాయ్:యుద్ధం వల్ల విమానాల రాకపోకలకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమాన ఇంధన ధర బాగా పెరగడంతో, సరకు రవాణా వ్యయాలు బాగా అధికమైనట్లు సమాచారం. ఇది అదనపు భారంగా కంపెనీలు పేర్కొంటున్నాయి.దీని ప్రభావం 2022- 23 ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.