అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలను ఆకట్టుకునేందుకు, దేశీయ కంపెనీలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం రూ.50,000 కోట్ల విలువైన మూడు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. అగ్రగామి 5 అంతర్జాతీయ మొబైల్ సంస్థలను ఆకట్టుకోవడమే లక్ష్యమని, అదే విధంగా తోడ్పాటు ఇవ్వడానికి 5 దేశీయ సంస్థలను స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా గుర్తిస్తామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ఇక్కడ తెలిపారు. 'ప్రపంచ, స్థానిక సామర్థ్యాలతో భారత్ మంచి తయారీ దేశంగా ఎదుగుతుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ మారిందని, ఇప్పుడు అగ్రస్థానం దిశగా దూసుకెళ్తోందని' మంత్రి తెలిపారు.
15-20 లక్షల మందికి ఉపాధి
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో వచ్చే కొన్నేళ్లలో 15 - 20 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ అన్నారు. ఈ పథకాలతో వచ్చే అయిదేళ్లలో విలువ పరంగా మొబైల్ ఉత్పత్తి రూ.8 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.5.98 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. వచ్చే 2-3 ఏళ్లలో అంతర్జాతీయ దిగ్గజ మొబైల్ సంస్థలు భారత్కు వస్తాయని, ఈ విభాగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. '2018-19లో మొబైల్ హ్యాండ్సెట్ల ఉత్పత్తి 29 కోట్లకు చేరింది. వీటి విలువ రూ.1.70 లక్షల కోట్లు. 2014-15లో రూ.38,263 కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు... 2018-19 నాటికి రూ.61,908 కోట్లకు చేరాయి. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ వాటా 2012లో 1.3 శాతంగా ఉండగా... 2018కి 3 శాతానికి పెరిగిందని' ప్రభుత్వం తెలిపింది.