కొవిడ్-19 ప్రభావం నుంచి అల్పాదాయ వర్గాలు గట్టెక్కాలంటే రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ అవసరం అవుతుందని అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం రూపొందించిన 'స్టేట్ ఆఫ్ ది వర్క్ 2021' నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావంతో దేశంలో 2020 ఆఖరుకు 23 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారు. 1.5 కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి.
- సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారిలో సగం మంది అసంఘటిత రంగంలోకి మారిపోయారు. 2019 చివరి నుంచి 2020 ఆఖరుకు స్వయం ఉపాధి(30 శాతం), ఒప్పంద వేతనాలు(10 శాతం) అసంఘటిత వేతనాలకు (9 శాతం) వీరు మారారు. అలాగే వారి ఆదాయ స్థాయులు కూడా తగ్గాయి.
- ఏప్రిల్, మేలో 20 శాతం పేద కుటుంబాలు తమ పూర్తి ఆదాయాన్ని కోల్పోయాయి.
- జన్ ధన్ యోజన కంటే పీడీఎస్ అనేది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉండటంతో కనీసం 2021 డిసెంబరు వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగించాలి.
- జన ధన్ ఖాతాలకే కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గృహాలకు 3 నెలలకు రూ. 5,000 నగదు బదిలీ చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంచడమే కాకుండా వేతనాలు కూడా పెంచాలి.