దాదాపు ఐదేళ్ల తర్వాత దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న భారీ టెలికాం స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం స్పెక్ట్రమ్ కొనుగోలుకు రూ. 77,146 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బిడ్లు దాఖలు చేశాయి. మంగళవారమూ వేలం కొనసాగనుందని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మొత్తం ఏడు బ్యాండ్ల పరిధిలో 2,250 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ విక్రయానికి ఈ వేలం నిర్వహిస్తున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల కోట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగా తొలి రోజు రూ. 77,146 కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. 800 మెగాహెర్జ్, 900 మెగాహెర్జ్, 1800 మెగాహెర్జ్, 2100 మెగాహెర్జ్, 2300 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌కు మాత్రమే టెలికాం కంపెనీలు బిడ్లు సమర్పించాయి.