కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం కంపెనీ ఖాతాల్లో కనీసం రూ.2,000 కోట్ల మేర మాయం అయినట్లు ఓ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఈ వ్యవహారాలతో సంబంధమున్న వ్యక్తులు తెలిపారు.
జులైలో సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత నెలల తరబడి జరిగిన దర్యాప్తులో కాఫీ డే ఖాతాల్లోని ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. డజన్ల కొద్దీ ప్రైవేటు కంపెనీలతో జరిగిన లావాదేవీలు అందులో ఉన్నాయి. వంద పేజీలున్న ఒక ముసాయిదా నివేదిక ప్రకారం.. 270 మిలియన్ డాలర్ల మేర అదృశ్యమైనట్లు ఆ వ్యక్తులు తెలిపారు. నివేదిక తుది దశలో ఉందని.. ఈ వారంలోనే విడుదలయ్యేందుకు అవకాశం ఉందంటున్నారు. అయితే దర్యాప్తు ఇంకా జరుగుతున్నందున తుది నివేదికలో మార్పులుండొచ్చని భావిస్తున్నారు.