ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేస్తూ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఏజెన్సీలు ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. సాధారణంగా ఇది వ్యక్తులు, కంపెనీలు, ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలకు ఇచ్చే రేటింగ్‌ను.. సౌర్వభౌమ రేటింగ్ అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రేటింగ్ చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.
అప్పుల విషయంలో రేటింగే కీలకం..
ఒక దేశానికి రుణం ఇచ్చినట్లయితే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని క్రెడిట్ రేటింగ్ తెలియజేస్తుంది. అంతేకాకుండా అందులో ఉండే రిస్కులను కూడా తెలుపుతుంది. అందుకే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థల నుంచి, ఇతర దేశాల నుంచి రుణం తీసుకోవడంలో ఈ రేటింగ్ ఉపయోగపడుతుంది.
క్రెడిట్ రేటింగ్ నిర్ణయించేందుకు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థలు అధ్యయనం చేస్తుంటాయి.
ఇందులో.. ఆర్థిక వ్యవస్థ పనితీరు, వాస్తవ జీడీపీ, తలసరి ఆదాయం, హెడ్లైన్ ద్రవ్యోల్బణం, జీడీపీలో స్థూల పెట్టుబడుల శాతం, జీడీపీలో స్థూల పొదుపు వంటి అంశాలను పరిగణించి రేటింగ్‌ను నిర్ణయిస్తాయి.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి
జీడీపీలో ప్రభుత్వ ఆదాయపు శాతం, ఖర్చుల శాతం, రుణాల శాతం, రాబడిలో వడ్డీల శాతం, బడ్జెట్ గణాంకాలు ప్రభుత్వ ఆర్థిక స్థితిని తెలుపుతాయి.
చెల్లింపులు, అప్పులు
జీడీపీలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ శాతం, జీడీపీలో బాహ్య రుణాల శాతం, అధికారిక రిజర్వుల శాతం, రాజకీయ రిస్క్, సామాజిక ఆర్థిక రిస్కు, బాహ్య పరిస్థితులకు లోనయ్యే ప్రమాదం, సంస్థాగత స్వాతంత్ర్యం వంటిని రేటింగ్ ఏజెన్సీలు సమీక్షిస్తాయి.
క్రెడిట్ రేటింగ్‌ను సమీక్షించే సమయంలో ప్రభుత్వం, కార్మిక, పౌర సమాజం, ప్రైవేట్ రంగంలో ఉన్న వారితో ఏజెన్సీలు చర్చిస్తాయి.
రేటింగ్ ఇలా..
ప్రపంచవ్యాప్తంగా రేటింగ్ ఇచ్చే సంస్థలు 70 వరకు ఉన్నాయి. అయితే అందులో మూడు మాత్రమే ప్రధానమైనవి. ఇవి మొత్తం రేటింగ్ మార్కెట్లో 91 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అవే ఎస్ &పీ, మూడీస్, ఫిచ్.
ఎస్ అండ్ పీ(స్టాండర్డ్ అండ్ పూర్స్) ఇచ్చే రేటింగ్‌లో బీబీబీ- లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉంటే పెట్టుబడి గ్రేడ్ దేశాలని అర్థం.
బీబీ ప్లస్, అంతకంటే తక్కువ రేటింగ్ ఉంటే అవి జంక్ గ్రేడ్ అని అర్థం చేసుకోవచ్చు. ఫిచ్ కూడా ఇదే రేటింగ్ నమూనాను అనుసరిస్తుంటుంది.
మూడీస్.. బీఏఏ3 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్‌ను పెట్టుబడి గ్రేడ్‌గా పరిగణిస్తుంది. బీఏ1, అంతకంటే తక్కువ రేటింగ్‌ను జంక్ గ్రేడ్‌గా చెబుతుంది.
రేటింగ్ ఎంత ముఖ్యం..
క్రెడిట్ రేటింగ్ అనేది ఏ దేశానికైనా అవసరమే. అభివృద్ధి చెందుతోన్న దేశాలకైతే మరీ ముఖ్యం. విదేశాల్లో సార్వభౌమ బాండ్లు ఇవ్వాలంటే రేటింగ్‌ను కీలకంగా చూస్తారు పెట్టుబడిదారులు. మంచి రేటింగ్ ఉన్న వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు.
రేటింగ్‌పై అధారపడి వడ్డీ రేట్లు నిర్ణయం అనేది జరుగుతుంది. మంచి రేటింగ్ ఉన్న దేశాల విషయంలో తక్కువ రిస్కు ఉంటుంది. కాబట్టి వాటికి తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయి. తక్కువ రేటింగ్ ఉన్న దేశాలకు ఎక్కువ వడ్డీకి రుణాలు దొరుకుతాయి. పెట్టుబడి గ్రేడ్ కంటే రేటింగ్ తగ్గినట్లయితే వడ్డీ ఛార్జీలు పెరుగుతాయి. దీనివల్ల దేశంపై వడ్డీల భారం పెరుగుతుంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కూడా క్రెడిట్ రేటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. మంచి రేటింగ్ ఉన్న దేశాల్లోకి వీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఎక్కువ మద్దతు లభిస్తుంది. మూలధనం ప్రవాహం ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.
క్రెడిట్ రేటింగ్ అనేది పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను మంచి ద్రవ్య, ఆర్థిక విధానాలను అనుసరించేలా చేస్తుంది ఈ క్రెడిట్ రేటింగ్. ద్రవ్య, ఆర్థిక విధానాలకు రేటింగ్ పద్ధతిలో భాగం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా దేశాలు మంచి నిర్ణయాలను తీసుకునేలా ప్రోత్సహిస్తాయి.
ఇదీ చూడండి:చదువు అంతంతే.. సంపద మాత్రం రూ.లక్షల కోట్లు!