రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. రిటైల్, టెలికాంలతో పాటు, పెట్రోరసాయనాల విభాగాలు రాణించడం ఇందుకు దోహదం చేసింది. 2020-21 చివరి (జనవరి-మార్చి) త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 129శాతం వృద్ధితో రూ.13,227 కోట్లకు చేరింది. ఇందులో రూ.797 కోట్ల అసాధారణ లాభం(అమెరికా షేల్ ఆస్తుల విక్రయం) కూడా కలిసి ఉంది. 2019-20 ఇదే త్రైమాసికంలో లాభం రూ.6348 కోట్లు మాత్రమే. కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.1,72,095 లక్షల కోట్లుగా నమోదైంది. 2019-20 ఇదే త్రైమాసికంతో పోలిస్తే 13.6 శాతం వృద్ధి చెందినట్లయింది.
జియో.. జూమ్:
జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 47.5% వృద్ధితో రూ.3508 కోట్లకు చేరింది. ఆదాయం 19% పెరిగి రూ.18,278 కోట్లుగా నమోదైంది. మార్చి ఆఖరుకు వినియోగదార్ల సంఖ్య 42.62 కోట్లకు చేరుకుంది. సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) రూ.138.2కు పరిమితమైంది. డిసెంబరు త్రైమాసికంలో ఇది రూ.151 కావడం గమనార్హం.
రిటైల్.. రయ్..రయ్:
గ్రోసరీ వ్యాపారంలో రికార్డు స్థాయి ఆదాయాలు; వినియోగదారు ఎలక్ట్రానిక్స్ విభాగంలో బలమైన వృద్ధి నమోదవడం వల్ల.. రిటైల్ వ్యాపారంలో పన్నుకు ముందు లాభాలు 41% వృద్ధితో రూ.3,623 కోట్లకు చేరుకున్నాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 826 విక్రయశాలలను జత చేసుకోవడంతో మొత్తం వాటి సంఖ్య 12,711కి చేరింది. కరోనా కేసుల కారణంగా రిటైల్ కార్యకలాపాలపై ఏప్రిల్‌లో ప్రభావం కనిపించింది. 35-40 శాతం మేర వినియోగదార్ల రాక తగ్గింది.
- పెట్రోరసాయనాల ఎబిటా 4.6% తగ్గి రూ.11,407 కోట్లకు చేరుకుంది.
- పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2020-21లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం మాత్రం 35% వృద్ధి చెంది రూ.53,739 కోట్లకు చేరింది. ఇప్పటి దాకా ఏ సంవత్సరంలోనైనా నమోదైన అత్యధిక లాభం ఇదే. దీనికి టెలికాం, రిటైల్ విభాగాల్లో నమోదైన అత్యధిక ఎబిటాలే కారణం. ఆదాయం 18.3 శాతం తగ్గి రూ.5,39,238 కోట్లకు చేరగా.. డిసెంబరు చివరితో పోలిస్తే మార్చి చివరకు కంపెనీ స్థూల రుణాలు రూ.2,57,413 కోట్ల నుంచి రూ.2,51,811 కోట్లకు తగ్గాయి. అదే సమయంలో జియోలో వాటాల విక్రయ నేపథ్యంలో నగదు నిల్వలు మాత్రం రూ.2,20,524 కోట్ల నుంచి రూ.2,51,811 కోట్లకు పెరిగాయి.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.42% నష్టంతో రూ.1994.45 వద్ద స్థిరపడింది.
"ఓ2సీ, రిటైల్, డిజిటల్ సేవలు భారీగా పుంజుకున్నాయి. అన్ని ప్లాంట్లలో వినియోగం అధికంగానే కొనసాగింది. డౌన్‌స్ట్రీమ్ ఉత్పత్తులు, రవాణా ఇంధన మార్జిన్లు కలిసి ఓ2సీ మార్జిన్ల వృద్ధికి దోహదం చేశాయి. కరోనా అందరి జీవితాలను దుర్భరం చేయగా..మేం ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా 75,000 ఉద్యోగాలు ఇవ్వగలిగాం. చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇతర సదుపాయాలనూ అందించాం."
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ
ఇదీ చదవండి:కలల ఇంటి నిర్మాణంలో ఖర్చు తగ్గించే మార్గాలు!