రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో(ఆర్‌ఐఎల్) (Aramco Reliance) వాటా కొనుగోలుకు సౌదీ అరామ్‌కో సిద్ధమైంది. మొత్తం షేర్ల రూపంలో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆ సంస్థ జరుపుతున్న చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని ఈ పరిణామాలతో సంబంధమున్న వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ 'బ్లూమ్‌బర్గ్' తెలిపింది. 'రిలయన్స్‌లో దాదాపు 20 శాతం వాటాను అరామ్‌కో సొంతం చేసుకోవచ్చు. దీని విలువ 20 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.1.5-1.87 లక్షల కోట్లు) వరకు ఉండొచ్చ'ని ఆ వర్గాలు అంటున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే వారాల్లో అరామ్‌కోతో ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు లాభాలందుకున్నాయి కూడా.
రిలయన్స్‌కు 1 శాతం వాటా?
ఈ ఒప్పందం ఫలితంగా తన రిఫైనరీలకు ఏ ఇబ్బంది లేకుండా ముడి చమురు సరఫరాను ఆర్‌ఐఎల్ పొందొచ్చు. అదే సమయంలో అరామ్‌కోలో వాటాదారుగానూ మారొచ్చు. అరామ్‌కో మార్కెట్ విలువ 1.9 లక్షల కోట్ల డాలర్లను పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్‌కు అందులో 1 శాతం వాటా దక్కే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈ లావాదేవీ ఇంకా చర్చల దశలోనే ఉందని.. అందుకు మరింత ఎక్కువ సమయం పట్టడానికి, లేదంటే మధ్యలోనే ఆగిపోవడానికీ అవకాశాలున్నాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.